LOADING...
New Cyber Tower: సైబరాబాద్‌లో రూ.200 కోట్లతో మరో సైబర్‌టవర్‌ నిర్మాణానికి సిద్ధం
సైబరాబాద్‌లో రూ.200 కోట్లతో మరో సైబర్‌టవర్‌ నిర్మాణానికి సిద్ధం

New Cyber Tower: సైబరాబాద్‌లో రూ.200 కోట్లతో మరో సైబర్‌టవర్‌ నిర్మాణానికి సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ అంటే మాదాపూర్‌ కూడలిలోని సైబర్‌టవర్‌ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు అదే తరహాలో ఆధునిక సదుపాయాలతో మరో సైబర్‌టవర్‌ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్‌ నగరపాలక సంస్థ కోసం ప్రత్యేక భవన సముదాయం నిర్మించనున్నారు. ఇందుకోసం కైత్లాపూర్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇంజినీర్లు భవన ఆకృతులను సిద్ధం చేస్తుండగా, అవి ఖరారైన తర్వాత ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

వివరాలు 

3 జోన్లు.. 16 సర్కిళ్లు

సైబరాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో మణికొండ, నార్సింగి, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, మియాపూర్‌, తెల్లాపూర్‌, పటాన్‌చెరు, కొల్లూరు, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, దుండిగల్‌, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, కొంపల్లి, మేడ్చల్‌ ప్రాంతాలు ఉన్నాయి. మూడు జోన్లు, 16 సర్కిళ్లతో ఏర్పాటైన ఈ సంస్థకు పూర్తిస్థాయి ప్రధాన కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైటెక్స్‌లోని న్యాక్‌ భవనంలో కమిషనర్‌ కార్యాలయం పనిచేస్తోంది. కొత్త భవన నిర్మాణంపై కమిషనర్‌ సృజన చర్యలను వేగవంతం చేశారు. సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

వివరాలు 

సమీకృత భవనం

ఓఆర్‌ఆర్‌ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పట్టణ ఆర్థిక ప్రాంతంగా గుర్తిస్తూ నగర పరిపాలనను పునర్వ్యవస్థీకరించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌, మల్కాజిగిరి నగరపాలక సంస్థలు ఏర్పడ్డాయి. వీటి ఆధారంగా జలమండలి, పోలీసు వ్యవస్థల్లో మార్పులు జరిగాయి. విద్యుత్‌, ఆదాయ శాఖల హద్దులను కూడా మార్చే అంశం పరిశీలనలో ఉంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని జీ ప్లస్‌ ఎనిమిది అంతస్తులతో భారీ భవన సముదాయం నిర్మించనున్నారు. ఇందులో నగరపాలక సంస్థ కార్యాలయం, ఆదేశ నియంత్రణ కేంద్రం, జలమండలి ఉన్నతాధికారి కార్యాలయం, విద్యుత్‌, ఆదాయ శాఖలకు గదులు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు అవసరమైన సేవలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో ఈ సమీకృత భవనాన్ని నిర్మించనున్నారు.

Advertisement