LOADING...
MGNREGA: ఉపాధి చట్టానికి కొత్త రూపం.. G RAM G పేరుతో కేంద్రం కీలక బిల్లు
ఉపాధి చట్టానికి కొత్త రూపం.. G RAM G పేరుతో కేంద్రం కీలక బిల్లు

MGNREGA: ఉపాధి చట్టానికి కొత్త రూపం.. G RAM G పేరుతో కేంద్రం కీలక బిల్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2025
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రామీణులకు ఉపాధి కల్పన లక్ష్యంగా రూపొందించిన కొత్త చట్టానికి సంబంధించిన బిల్లు ప్రతులను సోమవారం లోక్‌సభ సభ్యులకు పంపిణీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2005లో అమల్లోకి వచ్చిన ప్రస్తుత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (VB-G RAM G) బిల్లు-2025ను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Details

 శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం 

వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు బిల్లులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధికి హామీ ఇవ్వనున్నారు. అంతేకాకుండా, సంపన్నమైన, సుస్థిర గ్రామీణ భారత్‌ను నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవలే గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును 'పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన'గా మార్చిన సంగతి తెలిసిందే.

Details

పనిదినాల సంఖ్య 100 నుంచి 125 రోజులకు

అలాగే ఉపాధి పనిదినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు, రోజువారీ కనీస వేతనాన్ని రూ.240కి సవరించారు. గ్రామీణ ప్రాంతాల నిరుపేదలకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సుస్థిర ఆస్తుల సృష్టి, వనరుల ఉత్పాదకత పెంపు వంటి లక్ష్యాలతో దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 'ఎన్‌ఆర్‌ఈజీఏ' చట్టాన్ని తీసుకొచ్చింది. అనంతరం 2009లో దీనికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు.

Advertisement