LOADING...
High-speed corridor: కోల్‌కతా-చెన్నై NH-16కు ప్రత్యామ్నాయంగా కొత్త హైస్పీడ్‌ కారిడార్
కోల్‌కతా-చెన్నై NH-16కు ప్రత్యామ్నాయంగా కొత్త హైస్పీడ్‌ కారిడార్

High-speed corridor: కోల్‌కతా-చెన్నై NH-16కు ప్రత్యామ్నాయంగా కొత్త హైస్పీడ్‌ కారిడార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రానికి మరో హైస్పీడ్‌ కారిడార్‌ రాబోతోంది. ప్రస్తుతం కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి (NH-16) మన రాష్ట్రం మీదుగా సాగుతుండగా, దీనికి సమాంతరంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది. ఈ కొత్త కారిడార్‌ ప్రధానంగా సరకు రవాణాకు అనుకూలంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై వరకు ఈ హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మించనున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) వెల్లడించింది. ఇప్పటికే సలహా సంస్థను నియమించి, కారిడార్‌ ఎలైన్‌మెంట్‌పై అధ్యయనం చేపట్టింది.

Details

చైన్నై వరకు కొనసాగితే ప్రయోజనం

కోల్‌కతా-చెన్నై హైవేకి ఒక వైపు తీరప్రాంతం ఉండగా, కత్తిపూడి-కాకినాడ నుంచి ఒంగోలు వరకు NH-216 విస్తరించింది. అందువల్ల మరోవైపు ఈ కొత్త హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మార్గం విశాఖపట్నం నగరానికి సమీపంలో గుండా వెళ్లి, విజయవాడ సమీపంలోని అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ను కలుస్తుంది. అక్కడి నుంచి గుంటూరు అవతల మిగతా భాగం ప్రారంభమవుతుంది. అయితే ఇది చెన్నై వరకు కొనసాగకపోతే పూర్తి ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. అందుకే చెన్నై వరకు నిర్మించాలనే ప్రణాళికతో యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రూపకల్పన చేస్తున్నారు.

Details

అమరావతికి, రాష్ట్రానికి ప్రాధాన్యం

ప్రస్తుతం ఉన్న కోల్‌కతా-చెన్నై హైవేపై వాహన రద్దీ విపరీతంగా పెరిగింది. ఆ హైవే మొత్తం ఆరు వరుసలుగా లేకపోవడం, కొన్నిచోట్ల నాలుగు వరుసలుగా ఉండటం వల్ల వాహనాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. కొత్త హైవే వాహనదారులకు ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా, కొత్త ప్రాంతాలకు అనుసంధానం కల్పిస్తుంది. దీని ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ముఖ్యంగా అమరావతి చుట్టూ నిర్మిస్తున్న అవుటర్‌ రింగ్‌ రోడ్‌పై ఏడు హైవేలు కలిసేలా ప్రణాళిక ఉంది. దీంతో ఉత్తర భారతదేశం, దక్షిణాది రాష్ట్రాలను అమరావతి-విజయవాడలతో అనుసంధానం చేసే అవకాశం లభిస్తుంది. అమరావతిలో కొత్త సంస్థలు ఏర్పడుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు మరింత పెరుగుతాయని అంచనా. ఈ పరిణామాల్లో కొత్త హైవే రాష్ట్రానికి, అమరావతికి అత్యంత కీలకంగా మారనుంది.

Details

ఒక నెలలో స్పష్టత

అంతేకాకుండా కోల్‌కతా-చెన్నై హైవేకి ప్రత్యామ్నాయ జాతీయ రహదారి కావాలని ఉన్న డిమాండ్‌ ఇప్పుడు నెరవేరబోతోంది. ప్రస్తుతం ఢిల్లీలోని MoRTH ఉన్నతాధికారులు ఈ హైస్పీడ్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్లపై సమీక్ష చేస్తున్నారు. వచ్చే నెల రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి, వారి అనుమతి తీసుకున్నాకే తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. దాంతో పాటు ప్రాజెక్టు వ్యయం, భూసేకరణ అవసరాలు వంటి వివరాలపై కూడా స్పష్టత రానుంది.

Details

మూలపేట-విశాఖపట్నం కారిడార్‌ భవితవ్యం?

శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నుంచి విశాఖపట్నం వరకు 165 కిలోమీటర్ల పొడవులో గ్రీన్‌ఫీల్డ్‌ కోస్టల్‌ కారిడార్‌ నిర్మించాలనే ప్రతిపాదన ముందే ఉంది. 6/8 వరుసల ఈ కారిడార్‌ కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం చేస్తోంది. రూ.8,300 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. దీనిని కూడా హైస్పీడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌లో భాగం చేయాలని ప్రారంభంలో ఆలోచించారు. అయితే ఇప్పుడు MoRTH ఈ కారిడార్‌ను సముద్రతీరం కాకుండా, కోల్‌కతా-చెన్నై హైవేకి అటువైపునుండేలా తీసుకెళ్లాలని పరిశీలిస్తోంది. దీంతో మూలపేట-విశాఖపట్నం కోస్టల్‌ కారిడార్‌ భవిష్యత్తు ఏమవుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది.