Loading...
Tamil Nadu: ఏఐతో నకిలీ పుస్తకాల తయారీ.. తమిళనాడులో రూ.300 కోట్ల లైబ్రరీ కుంభకోణం!
ఏఐతో నకిలీ పుస్తకాల తయారీ.. తమిళనాడులో రూ.300 కోట్ల లైబ్రరీ కుంభకోణం!

Tamil Nadu: ఏఐతో నకిలీ పుస్తకాల తయారీ.. తమిళనాడులో రూ.300 కోట్ల లైబ్రరీ కుంభకోణం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్మించిన పెరియార్ అరివులగం గ్రంథాలయం ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో నకిలీ పుస్తకాలు రూపొందించి,ఫేక్ పబ్లిషర్స్,ఫేక్ రైటర్స్ పేర్లతో లైబ్రరీకి విక్రయించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రంథాలయంలో వేలాది నకిలీ పుస్తకాలు ఉన్నాయన్న ఆరోపణలతో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల కోయంబత్తూరులోని పెరియార్ అరివులగం లైబ్రరీలో పుస్తకాల కొనుగోళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ ప్రచురణ సంస్థలు,రచయితల పేర్లతో వేలాది పుస్తకాలను కొనుగోలు చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

వివరాలు 

కొన్ని పుస్తకాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారు: పెరుమాళ్ మురుగన్

ముఖ్యంగా చారిత్రక అంశాల్లో తప్పులు, వ్యాకరణ దోషాలు ఉండటంతో పాటు, కొన్ని పుస్తకాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించినట్లు ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ఆరోపించారు.

మురుగన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అగల్ విళక్కు అనే ప్రచురణ సంస్థకు చెందిన సుమారు 1,800 పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి.

ఫీనిక్స్ పబ్లికేషన్స్ నుంచి మరో 100 పుస్తకాలను కొనుగోలు చేశారు.

వీటిలో కొన్ని పుస్తకాల ధర రూ.1,400కు పైగా ఉండటం, రచయితల పేర్లపై అనుమానాలు వ్యక్తమవడం వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి.

వివరాలు 

పుస్తకాల నాణ్యత, వాటి రచయితలు, ప్రచురణ సంస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు

తమిళ సాహిత్యం, చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో అనేక వాస్తవ తప్పులు, వ్యాకరణ దోషాలు ఉన్నాయని పెరుమాళ్ మురుగన్ ఆధారాలతో సహా వివరించారు.

1947లో తమిళనాడు తొలి ముఖ్యమంత్రి పేరును తప్పుగా పేర్కొనడం, ప్రముఖ సాహిత్య రచనలకు సంబంధించి రచయితల పేర్లను తప్పుగా ముద్రించడం వంటి అంశాలను ఆయన బయటపెట్టారు.

దీంతో పుస్తకాల నాణ్యత, వాటి రచయితలు, ప్రచురణ సంస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి.

ADVERTISEMENT

వివరాలు 

వివాదం వెనుక..

పెరియార్ అరివులగం గ్రంథాలయ నిర్మాణం గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది.

ప్రస్తుత టీవీకే ప్రభుత్వ హయాంలో పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.300కోట్లతో నిర్మించిన ఈ గ్రంథాలయాన్ని 2026 అక్టోబర్ 16న ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించారు.

అయితే, పుస్తకాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం మొదలైంది.

ఈ వ్యవహారంపై సీఎం విజయ్ డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రంథాలయ నిర్మాణం డీఎంకే ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని,అక్కడ ఏవైనా అక్రమాలు జరిగితే అందుకు గత ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

అయితే, పుస్తకాల కొనుగోళ్లు తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని డీఎంకే పేర్కొంది. విజయ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఈ వ్యవహారంలో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఈ వివాదంపై స్పందించిన కమల్ హాసన్

మరోవైపు, పుస్తకాల కొనుగోళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ అధికారులను ఆదేశించారు.

ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

డీఎంకే మిత్రపక్షమైన మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ఈ వివాదంపై స్పందించారు.

ఈ ఘటన తమిళ భాషకు జరిగిన అవమానంగా అభివర్ణించారు.

కాంగ్రెస్ నేత మాణికం టాగోర్ సైతం గ్రంథాలయానికి పుస్తకాల కొనుగోళ్లపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని కోరారు.

వివరాలు 

విచారణ పూర్తయితేనే..

అసలు ఈ పుస్తకాలను ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎవరి ఆదేశాలతో ప్రచురణ సంస్థలు వాటిని సరఫరా చేశాయి? కొనుగోళ్ల వెనుక ఎవరున్నారు? ఈ వ్యవహారంలో ఎవరికి ఆర్థికంగా లబ్ధి చేకూరింది? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా మారాయి.

విచారణ పూర్తయితేనే ఈ ఆరోపణల్లో వాస్తవాలేమిటో, బాధ్యులెవరో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT