New rules for Kota hostels: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడానికి.. కోట హాస్టళ్లకు కొత్త మార్గదర్శకాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉన్నత విద్యా కోచింగ్,ఉద్యోగాల కోసం ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒత్తిడి కారణంగా ఇటీవల కాలంలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
హాస్టళ్లలోని ఫ్యాన్లకు ఉరివేసుకోవడం, విషం తాగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, 2025-26 విద్యా సంవత్సరానికి ముందు విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించేందుకు కోటా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది.
'కోటా కేర్స్' ప్రచారం కింద కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
వివరాలు
విద్యార్థుల భద్రత కోసం కొత్త మార్గదర్శకాలు
కోటా యంత్రాంగం ప్రధానంగా విద్యార్థుల జీవన వ్యయాన్ని తగ్గించడం,హాస్టళ్లలో భద్రతా చర్యలు పెంచడంపై దృష్టి సారించింది.
పట్టణంలో ఉన్న 4,000హాస్టళ్లలో భద్రతను మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టింది.
ఇంతకుముందు హాస్టళ్ల యాజమాన్యాలు విద్యార్థుల నుండి వార్షిక ఫీజును ముందుగానే వసూలు చేసేవి.
అయితే,కొత్త నిబంధనల ప్రకారం,ఇకపై రూ.2,000 వరకు మాత్రమే డిపాజిట్‌గా వసూలు చేయడానికి నిబంధనలు విధించారు.
కోటా జిల్లా కలెక్టర్ డాక్టర్ రవీంద్ర గోస్వామి ఈ మార్గదర్శకాలను ప్రకటించారు.
'కోటా కేర్స్' క్యాంపెయిన్ కింద విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
హాస్టళ్లలో ఆత్మహత్యలు నిరోధించేందుకు స్ప్రింగ్ లోడెడ్ సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా, హాస్టళ్ల సిబ్బందికి ప్రత్యేక శిక్షణను అందించనున్నట్లు తెలిపారు.
వివరాలు
విద్యార్థుల ఒత్తిడి తగ్గించే ప్రత్యేక చర్యలు
ఒత్తిడిని తగ్గించేందుకు విద్యార్థులకు ఓ మోస్తరు విహార అవకాశాలను కల్పించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా, చంబల్ రివర్ ఫ్రంట్ మరియు ఆక్సిజన్ జోన్ పార్కులోకి విద్యార్థులకు వన్ టైమ్ పాస్ ప్రాతిపదికన ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నారు.
అదనంగా, హాస్టల్ సిబ్బంది రాత్రిపూట మాన్యువల్ హాజరును తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు హాస్టళ్లలో వినోద ప్రదేశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అంతేగాక, రైల్వే స్టేషన్, బస్టాండ్స్ వద్ద 'కోటా కేర్స్' హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. వరుస ఆత్మహత్యల కారణంగా కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది.
వివరాలు
స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల అమలు
2024-25 విద్యా సంవత్సరానికి కోటా హాస్టళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య 2 లక్షల నుండి 1.24 లక్షలకు పడిపోయింది.
ప్రస్తుతం హాస్టళ్ల ఆక్యుపెన్సీ 40 శాతానికి కూడా తగ్గిపోయింది, దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
అధికారులు ఇప్పటికే కొన్ని హాస్టళ్లలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమలు చేశారు. ఈ ఫ్యాన్లు లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్‌కాయిల్ అయ్యేలా రూపొందించబడ్డాయి.
ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని తగ్గించేందుకు ఈ చర్య ఉపయుక్తంగా మారుతుందని భావిస్తున్నారు.
ఈ విధంగా, విద్యార్థుల భద్రతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, కోటా అధికారులు నూతన మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు.