Telangana: ప్రభుత్వ పాఠశాలలు-కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ కొత్త చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో విద్యాశాఖ కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే 'ఆచార్య జయశంకర్ బడిబాట' కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, ఇకపై అదే కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల వరకు విస్తరించనున్నారు. దీంతో కళాశాలల అధ్యాపకులు కూడా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ప్రత్యక్షంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి అవసరమైన షెడ్యూల్‌ను ఖరారు చేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె, పలు కీలక నిర్ణయాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
వివరాలు
ఫిబ్రవరి 22న 'టీజీసెట్' పేరుతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం 'సాధన' కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 637 ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం వచ్చే ఫిబ్రవరి 22న 'టీజీసెట్' పేరుతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు పోటీ పడనున్నారు. ప్రస్తుతం గురుకులాల్లో అన్ని సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదన్న నేపథ్యంలో, సీట్లు నిండటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా ఎంపిక కావాలన్న ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహించడంతో పాటు, బిట్ బ్యాంకుతో కూడిన స్టడీ మెటీరియల్‌ను 'సాధన' పేరుతో రూపొందించనున్నారు.
వివరాలు
త్వరలో 54,346 పుస్తకాల పంపిణి
ప్రతి పాఠశాలకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల కోసం ఒక్కొక్కటి చొప్పున మొత్తం 54,346 పుస్తకాలను త్వరలో పంపిణీ చేయనున్నారు. గురుకులాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు నేరుగా కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం సుమారు 1.60 లక్షల మంది నాలుగో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. ఇదే సమావేశంలో విద్యాశాఖ మరికొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
వివరాలు
ప్రాక్టికల్స్‌ను సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించుకునే వెసులుబాటు
డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు తమకు సమీపంలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో పాఠాలు బోధిస్తే వారికి నిర్దిష్ట క్రెడిట్లు కేటాయించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సాంకేతిక, కళాశాల విద్యాశాఖలను ఆదేశించారు. అలాగే మూడో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి వచ్చే ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్)' పేరుతో నిర్వహించనున్న సర్వేలో భాగంగా జరిగే పరీక్షలకు విద్యార్థులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మరోవైపు, టి-స్టెమ్ పోర్టల్ ద్వారా పాఠశాలల్లో ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు తమ ప్రాక్టికల్స్‌ను సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని కూడా స్పష్టం చేశారు.