LOADING...
Google: భారత్‌-అమెరికా ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్‌సీ కేబుల్‌.. విశాఖలో 15 బిలియన్‌ డాలర్ల ఏఐ హబ్‌: గూగుల్‌ భారీ ప్రణాళిక
విశాఖలో 15 బిలియన్‌ డాలర్ల ఏఐ హబ్‌: గూగుల్‌ భారీ ప్రణాళిక

Google: భారత్‌-అమెరికా ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్‌సీ కేబుల్‌.. విశాఖలో 15 బిలియన్‌ డాలర్ల ఏఐ హబ్‌: గూగుల్‌ భారీ ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-అమెరికా మధ్య కృత్రిమ మేధస్సు (ఏఐ) కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కొత్త సబ్‌సీ కేబుల్‌ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో పాల్గొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 15 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ హబ్‌ను స్థాపించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్‌ ఏర్పాటుపై కూడా ప్రస్తావించారు. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని,అత్యాధునిక ఏఐ సాంకేతిక ప్రయోజనాలు ప్రజలు,వ్యాపార వర్గాలకు చేరువవుతాయని ఆయన చెప్పారు. రాబోయే అవకాశాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

భారత్‌ వంటి దేశాలకు ఇది కొత్త అవకాశాల ద్వారాలు

సమిట్‌లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "భారతదేశం ఏఐ సాంకేతికతతో అసాధారణమైన పురోగతిని సాధిస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఆ ప్రయాణంలో మేమూ భాగస్వాములు కావాలనుకుంటున్నాం. మన జీవితకాలంలో జరిగిన అతిపెద్ద సాంకేతిక మార్పు ఏఐ. భారత్‌ వంటి దేశాలకు ఇది కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుంది. ఆరోగ్యం, విద్య, వాతావరణ రంగాల్లో సంభవించే మార్పులను అర్థం చేసుకోవడం ఏఐ ద్వారా సాధ్యమవుతుంది. భారతదేశంలో ఏఐ ఆధారిత వాయిస్‌, విజువల్‌ సెర్చ్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోందని గమనించాను. అమెరికా-భారత్‌ మధ్య కొత్త సబ్‌సీ కేబుల్‌ ఏర్పాటుతో ఏఐ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది" అని ఆయన వివరించారు.

వివరాలు 

విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

దేశంలోని విద్యార్థులు, ఉద్యోగులకు విస్తృత స్థాయిలో నైపుణ్య శిక్షణ అందించడంపై గూగుల్‌ ప్రత్యేక దృష్టి పెట్టిందని పిచాయ్‌ తెలిపారు. విద్యార్థులు మరియు వృత్తి నిపుణుల కోసం 'గూగుల్‌ ఏఐ ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌' కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 'కర్మయోగి భారత్‌' భాగస్వామ్యంతో 18 భాషల్లో, దేశంలోని 800 జిల్లాల్లోని 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల ద్వారా జెనరేటివ్‌ ఏఐ సాయంతో 10 వేలకుపైగా పాఠశాలల్లో చదువుతున్న 1.10 కోట్ల మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నామని తెలిపారు. శాస్త్రీయ పరిశోధనలను వేగవంతం చేయడమే లక్ష్యంగా 30 మిలియన్‌ డాలర్ల నిధితో 'ఏఐ ఫర్‌ సైన్స్‌ ఇంపాక్ట్‌ ఛాలెంజ్‌'ను ప్రారంభించామని చెప్పారు.

Advertisement

వివరాలు 

ఏఐ మోడ్‌ 35 కొత్త భాషల్లో, 200 దేశాల్లో అందుబాటులో..

దీని ద్వారా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, వాతావరణ మార్పులు వంటి కీలక రంగాల్లో ఏఐ సాయంతో ఆవిష్కరణలను వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. గత దశాబ్దంలో గూగుల్‌ అందించిన ఏఐ ఓవర్‌వ్యూస్‌,సెర్చ్‌ ఫలితాలు,ఏఐ రూపొందించిన సమ్మరీలు ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయని చెప్పారు. ప్రస్తుతం ఏఐ మోడ్‌ 35 కొత్త భాషల్లో, 200 దేశాల్లో అందుబాటులో ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో రియల్‌టైమ్‌ లైవ్‌ సెర్చ్‌, వాయిస్‌ మరియు కెమెరా ఆధారిత సెర్చ్‌ సదుపాయాలు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. దీని వల్ల మరింత మంది తమ మాతృభాషలో అవసరమైన సమాచారాన్ని సులభంగా పొందగలుగుతారని పేర్కొన్నారు. జెమినై యాప్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారత్‌లో ఇది 10 భాషల్లో అందుబాటులో ఉందని తెలిపారు.

Advertisement

వివరాలు 

ఏఐ వినియోగంపై ప్రధానితో చర్చ

గూగుల్‌ డీప్‌మైండ్‌,భారత ప్రభుత్వ మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. ఆరోగ్య రంగం, అన్ని భాషల్లో సమాచార విస్తరణ, స్టార్టప్‌లు, వ్యవసాయం వంటి విభిన్న రంగాల్లో ఏఐని ఎలా సమర్థంగా వినియోగించాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో చర్చించినట్లు పిచాయ్‌ 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు.

Advertisement