LOADING...
Cheyutha pensions: పింఛన్లకు కొత్త టెక్నాలజీ.. ముఖ గుర్తింపు యాప్‌తో పంపిణీ!
పింఛన్లకు కొత్త టెక్నాలజీ.. ముఖ గుర్తింపు యాప్‌తో పంపిణీ!

Cheyutha pensions: పింఛన్లకు కొత్త టెక్నాలజీ.. ముఖ గుర్తింపు యాప్‌తో పంపిణీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం స్టేట్ లెవల్ పింఛన్‌ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 29వ తేదీ నుంచి 'ముఖ గుర్తింపు' (ఫేసియల్‌ రికగ్నిషన్‌) సాంకేతికత ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్‌ బాధితులు ఇలా 44 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం, పంపిణీ ప్రక్రియలో అడ్డంకులు తొలగించేందుకు ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వృద్ధుల వేళ్ల రేఖలు మరుగవడం వల్ల బయోమెట్రిక్‌ పద్ధతిలో పింఛన్ల పంపిణీ కష్టంగా మారింది. కొందరికి నిధులు చేరకపోవడం, మరికొందరి పేరిట ఇతరులు పింఛన్లు తీసుకెళ్లడం వంటి సమస్యలపై ప్రభుత్వం సమీక్ష జరిపింది.

Details

తొలి దశలో ఎవరికీ?

టీజీ ఆన్‌లైన్‌ సంస్థ సాంకేతిక సహకంతో ముఖ గుర్తింపు విధానాన్ని ప్రారంభించనుంది. తొలిదశలో తపాలా కార్యాలయాల ద్వారా పింఛన్లు అందుకుంటున్న 23 లక్షల మందిపై ఈ విధానం అమలు కానుంది. నగరాలు, పట్టణాల్లో బ్యాంకుల ద్వారా పింఛన్లు పొందుతున్న మిగిలిన 21 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రస్తుతం ఉన్న పద్ధతే కొనసాగుతుంది.

Details

కొత్త యాప్, శిక్షణ, సాంకేతిక ప్రణాళిక 

ఈ విధానం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. పోస్టుమాస్టర్లు, పోస్టుమ్యాన్‌లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్‌ కలెక్టర్లు ఈ యాప్‌ ఉపయోగించేందుకు శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం, శనివారం నుంచి పోస్టల్ సిబ్బంది, గ్రామ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ కొత్త విధానం అమలుకు రూ.13 కోట్ల వ్యయంతో 6 వేల మంది పోస్టుమ్యాన్‌లు, పోస్టుమాస్టర్లకు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు చేపట్టారు. నూతన యాప్‌ను వారు డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగిస్తారు.

Details

పంపిణీ ప్రక్రియ ఎలా?

పింఛన్‌దారులు పోస్టాఫీసులకు వచ్చినప్పుడు వారి ఫోటో తీసి, ఆధార్‌ డేటాబేస్‌లోని ఫోటోతో సరిపోల్చి, యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. సరిపోలిన అనంతరం వారి ఖాతాల్లోకి పింఛన్‌ జమ చేస్తారు. ఏదైనా కారణంగా ఫోటో తీయలేని పరిస్థితుల్లో బయోమెట్రిక్‌ ద్వారా పింఛన్‌ ఇస్తారు. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్‌ రెండూ పనిచేయని స్థితిలో గ్రామ కార్యదర్శులు వేలిముద్రలను నమోదు చేసి పింఛన్లు చెల్లిస్తారు.

Details

కార్యాచరణ

ఈ కొత్త విధానానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేస్తుంది. మంగళవారం (జూలై 30) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీలో పారదర్శకత, న్యాయబద్ధత మరింత పెరుగుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.