Amrit Bharat Express : ఏపీ మీదుగా కొత్త రైలు మార్గం.. చర్లపల్లి-నాగర్‌కోయిల్ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ సెంట్రల్ పరిధిలో ప్రయాణికులకు మరో శుభవార్త లభించింది. ఇండియన్ రైల్వేకు చెందిన రైల్వే బోర్డు, హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాగర్‌కోయిల్ వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేసింది. దీంతో హైదరాబాద్‌కు కనెక్ట్ అయ్యే మూడో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ముజఫర్‌పూర్ వరకు ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. అలాగే తిరువనంతపురం నుంచి మరో రైలును గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అధికారుల ప్రకారం అమృత్ భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ (నాన్-ఏసీ) కోచ్‌లు ఉంటాయి. ఈ కొత్త రైలు సేవ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఇంకా ఖరారు కాలేదు.
Details
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా అనుసంధానం
అయితే త్వరలోనే జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేయనుంది. అమృత్ భారత్ రైళ్లను సుదూర ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పించేలా రూపొందించామని అధికారులు తెలిపారు. సుమారు 800 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న లేదా 10 గంటల కంటే ఎక్కువ ప్రయాణ సమయం అవసరమయ్యే ప్రధాన నగరాలను ఇవి కలుపుతాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రయాణికులు తక్కువ టికెట్ ధరతో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణించే అవకాశం పొందుతారని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Details
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌లో మార్పులు
ఇక మరోవైపు రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా కాచిగూడ్ రైల్వే స్టేషన్ - యశ్వంత్ పూర్ - కాచిగూడ మధ్య నడిచే రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు చేశారు. దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం యశ్వంతపూర్ - కాచిగూడ (ట్రైన్ నం. 20704) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గతంలో మధ్యాహ్నం 3:48 గంటలకు హిందూపుర్‌కు చేరుకుని 3:50 గంటలకు బయల్దేరేది. అయితే ఇకపై ఈ రైలు మధ్యాహ్నం 3:55 గంటలకు చేరుకుని 3:57 గంటలకు బయల్దేరుతుంది.
Details
నూతన టైమింగ్స్ మార్చి 15 నుంచి అమల్లోకి
అలాగే కాచిగూడ - యశ్వంతపూర్ (ట్రైన్ నం. 20703) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గతంలో మధ్యాహ్నం 12:08 గంటలకు హిందూపూర్ రైల్వే స్టేషన్ చేరుకుని 12:10 గంటలకు బయల్దేరేది. ఇకపై ఇది మధ్యాహ్నం 12:17 గంటలకు చేరుకుని 12:19 గంటలకు బయల్దేరుతుంది. ఈ కొత్త టైమింగ్స్ మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.