LOADING...
CM Vijay: విజయ్-సంగీత విడాకుల కేసులో కొత్త మలుపు.. ఆగస్టులో తదుపరి విచారణ
విజయ్-సంగీత విడాకుల కేసులో కొత్త మలుపు.. ఆగస్టులో తదుపరి విచారణ

CM Vijay: విజయ్-సంగీత విడాకుల కేసులో కొత్త మలుపు.. ఆగస్టులో తదుపరి విచారణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం మధ్య కొనసాగుతున్న విడాకుల వ్యవహారం మరోసారి కోర్టు ముందుకొచ్చింది. సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సోమవారం చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఉదయం 10.30 గంటలకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగీత స్వర్ణలింగం విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

వివరాలు

సంచలన ఆరోపణలు చేసిన సంగీత

తన పిటిషన్‌లో సంగీత పలు సంచలన ఆరోపణలు చేశారు. 2021లోనే విజయ్‌కు ఓ నటి‌తో వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని గుర్తించానని, ఆ అంశంపై ప్రశ్నించగా ఆ బంధాన్ని తెంచుకుంటానని విజయ్ పలుమార్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ హామీలను నిలబెట్టుకోకుండా విజయ్ సదరు నటితో సంబంధాన్ని కొనసాగించారని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ నటితో కలిసి విహారయాత్రలు వెళ్లడం, వివిధ కార్యక్రమాలకు హాజరుకావడం జరిగిందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను ఆ నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తాను, తన ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషా తీవ్ర అవమానానికి గురయ్యామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు

ఆర్థిక ఆంక్షలు విధించారని ఆరోపణ

విజయ్ తనపై ఆర్థిక ఆంక్షలు కూడా విధించారని సంగీత ఆరోపించారు. గతంలో కల్పించిన పలు సౌకర్యాలను ఉపసంహరించుకోవడంతో పాటు తన వ్యక్తిగత స్వేచ్ఛను కూడా నియంత్రించారని తెలిపారు. ఈ పరిణామాల కారణంగా తాను తీవ్రమైన మానసిక వేదన అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్ 27(1)(a), 27(1)(d) ప్రకారం తమ వివాహ బంధాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేయాలని సంగీత కోర్టును కోరారు.

Advertisement

వివరాలు

26 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధం

2000 సంవత్సరంలో వివాహం చేసుకున్న విజయ్, సంగీత దంపతులు దాదాపు 26 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేసు విచారణ ఏప్రిల్ 20న జరగాల్సి ఉండగా, ఇరువురు హాజరుకాకపోవడంతో జూన్ 15న తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, వ్యక్తిగత జీవితంలో వివాదాలు కొనసాగుతున్నప్పటికీ విజయ్ రాజకీయంగా మాత్రం భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను ఓడించిన టీవీకే పార్టీ అధికారంలోకి రావడంతో, విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement