Bhajanlal Sharma: రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేను వరించిన సీఎం పదవి
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మను బీజేపీ ప్రకటించింది. బీజేపీ పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, సరోజ్ పాండే సమక్షంలో జైపూర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భజన్ లాల్ శర్మ పేరును సీఎం పీఠాన్ని ఆశించిన మరో సీనియర్ నేత వసుంధర రాజే ప్రకటించారు. దియా కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వాను ఇద్దరు డిప్యూటీలు, వాసుదేవ్ దేవ్‌నానీ స్పీకర్‌గా ఎంపిక చేశారు. శర్మ సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 48,081ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌కు చెందిన భరద్వాజ్‌పై విజయం సాధించారు. భరత్‌పూర్‌కు చెందిన భజన్‌లాల్ శర్మ చాలా కాలంగా బీజేపీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం శర్మ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం
రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను బీజేపీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చింది. శర్మ ఈ ఎన్నికల్లో సంగనేర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శర్మను సీఎం పీఠం వరించింది. వాస్తవానికి రాజస్థాన్ అసెంబ్లీల్లో శర్మను బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పోటీలో నిలిపింది. సంగనేర్‌లో బీజేపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి.. భజన్ లాల్ శర్మను పార్టీ బరిలోకి దింపింది. తొలిసారి పోటీ చేసి శర్మ 40వేల మోజార్టీతో గెలుపొందారు. అయితే శర్మకు బీజేపీతో సుధీర్ఘకాలంగా అనుబంధం ఉంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు సార్లు పని చేశారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో శర్మకు బలమైన అనుబంధం ఉంది.