LOADING...
Hyderabad - Manneguda road: హైదరాబాద్‌-మన్నెగూడ రహదారికి ఎట్టకేలకు ఎన్‌జీటీ గ్రీన్‌ సిగ్నల్
హైదరాబాద్‌-మన్నెగూడ రహదారికి ఎట్టకేలకు ఎన్‌జీటీ గ్రీన్‌ సిగ్నల్

Hyderabad - Manneguda road: హైదరాబాద్‌-మన్నెగూడ రహదారికి ఎట్టకేలకు ఎన్‌జీటీ గ్రీన్‌ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ రహదారి-163లోని హైదరాబాద్‌ (అప్పా జంక్షన్‌) నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణ ప్రాజెక్ట్‌ ప్రారంభం నుంచే ఆటంకాలను ఎదుర్కొంటోంది. తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) అనుమతినిచ్చినా, ప్రభుత్వం ఇతర మార్గాలను పరిగణనలోకి తీసుకోకుండా మర్రిచెట్లు ఎక్కువగా ఉన్న ప్రస్తుత మార్గానికే ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తే రహదారి మరింత భద్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా, ఆ దిశగా అధికార యంత్రాంగం పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ప్రతిపాదన - భూసేకరణలో ఆటంకాలు 

హైదరాబాద్‌-మన్నెగూడ రహదారి మొదట ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్‌-4)గా ఉండేది. 2016లో దీన్ని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్‌ చేశారు. 2018లో జాతీయ రహదారి నంబర్‌ను కేటాయించి, అదే సంవత్సరంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 46 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం రహదారిలో మలుపులు అధికంగా ఉండడంతో కొన్ని చోట్ల గ్రీన్‌ఫీల్డ్‌ పద్ధతిలో నేరుగా రహదారి నిర్మిస్తే సౌలభ్యంగా ఉంటుందని సూచనలున్నాయి. అయితే కొత్త రహదారి నిర్మిస్తే భూసేకరణ అవసరం అవుతుంది. ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల భూములు, ఫాం హౌస్‌లు ఉండటంతో భూసేకరణ ప్రక్రియ చాలా కాలం నిలిచిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వివరాలు 

ప్రముఖుల ఒత్తిడి కారణమా? 

రహదారి ప్రాజెక్ట్‌ చేపట్టే ముందు డీపీఆర్‌ (డిటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) సిద్ధం చేయడం తప్పనిసరి. అందులో సాధారణంగా నాలుగు విభిన్న ఎలైన్‌మెంట్‌ ఆప్షన్లు ఉంటాయి.వాటిలో ఆటంకాలు తక్కువగా ఉన్న మార్గాన్ని ఎంచుకోవాలి. అయితే ప్రముఖుల ఒత్తిడి కారణంగా అధికారులు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రహదారినే నాలుగు వరుసలుగా విస్తరించే దిశగా మొగ్గుచూపారని ప్రచారం జరిగింది. ఈ నిర్ణయంతో పలు పర్యావరణవేత్తలు ఎన్‌జీటీని ఆశ్రయించారు. వారు ఈ మార్గంలో ఉన్న 915 మర్రిచెట్లు తొలగిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని వాదించారు. 2021లో కేసు నమోదు కాగా, ఎన్‌జీటీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖను పర్యావరణ ప్రభావ పరిశీలన (EIA) చేపట్టమని ఆదేశించింది. ఈ మధ్యే, 2022 మేలో నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరింది.

వివరాలు 

సుప్రీంకోర్టు మార్గం - ఎన్‌జీటీ తుది గ్రీన్‌ సిగ్నల్‌ 

రహదారి నిర్మాణం 24 నెలల్లో పూర్తవ్వాల్సి ఉండగా, 2025 మార్చిలో సమర్పించిన EIA నివేదిక పూర్తిగా సమగ్రమైనదిగా లేదని ఎన్‌జీటీ అభిప్రాయపడింది. కాబట్టి మరింత లోతైన అధ్యయనం అవసరమని పేర్కొంది. ఎన్‌జీటీ తీర్పును సవాల్‌ చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ప్రాజెక్ట్‌ నిలిచిపోయింది. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ కొన్ని మర్రిచెట్లను సమీప పొలాలల్లోకి మారుస్తామని, మిగిలిన వాటిని కాపాడుతామని ఎన్‌జీటీకి తెలిపింది. దాంతో ట్రైబ్యునల్‌ అక్టోబర్‌ 31న రహదారి విస్తరణ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

వివరాలు 

మర్రిచెట్లు ఉన్న ప్రాంతాల్లో రహదారి కుదింపు అవకాశం 

అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు 26 కిలోమీటర్ల ప్రాంతంలోనే ఎక్కువగా మర్రిచెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేసుంటే పర్యావరణ సమస్య తలెత్తేది కాదన్న అభిప్రాయం నిపుణులది. కానీ ఎన్‌హెచ్‌ఏఐ ఆ దిశగా బలమైన వాదనలు వినిపించలేదని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతానికి సుమారు 150 మర్రిచెట్లను మాత్రమే తొలగించి, మిగతా 765 చెట్లను అలాగే ఉంచే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దీంతో రహదారి నిర్మాణంలో మర్రిచెట్లు ఉన్న ప్రాంతాల్లో వెడల్పు తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఏర్పడితే, రహదారి విస్తరణ జరిగినప్పటికీ ప్రమాదాల అవకాశాలు కొనసాగుతాయన్న అభిప్రాయం నిపుణులది.