Loading...
National Highways: హైవేపై ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకోవాలి.. ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా
హైవే అంబులెన్సులు.. 10 నిమిషాల్లో చేరుకోకుంటే రూ.10వేల పెనాల్టీ

National Highways: హైవేపై ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకోవాలి.. ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రమాద స్థలానికి అంబులెన్సులు చేరుకునే సమయంపై కఠిన నిబంధనలు విధించింది. నిర్ణయించిన సమయంలో సేవలు అందించకపోతే సంబంధిత ఆపరేటర్లపై జరిమానాలు విధించనుంది. ప్రమాద స్థలానికి 10 నిమిషాల్లో.. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన ప్రదేశానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అంబులెన్స్ గరిష్ఠంగా 10 నిమిషాల్లో అక్కడికి చేరుకోవాలి. ఈ గడువులోగా చేరుకోకపోతే ఒక్కో ప్రమాదానికి రూ.10 వేల జరిమానా విధిస్తారు. అయితే ప్రమాద స్థలం అంబులెన్స్‌కు 10 కిలోమీటర్లకు మించి దూరంలో ఉంటే.. ఆ దూరానికి అనుగుణంగా అదనపు సమయాన్ని అనుమతిస్తారు.

వివరాలు 

బాధితులను గంటలోపు ఆసుపత్రికి..

అంబులెన్స్‌లోని జీపీఎస్‌ వ్యవస్థ ద్వారా అధికారులు వాహనం కదలికలు, చేరుకున్న సమయాన్ని పర్యవేక్షిస్తారు.

అత్యవసర సేవ కోసం అంబులెన్స్‌కు టికెట్ వచ్చిన తర్వాత.. ప్రమాద బాధితులను సమీపంలోని ఆసుపత్రికి గంటలోపే తరలించాలని NHAI నిర్దేశించింది.

నిర్ణయించిన సమయంలోగా బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లకపోయినా రూ.10 వేల పెనాల్టీ విధిస్తారు.

అత్యవసర టికెట్‌ను అంబులెన్స్ సిబ్బంది తిరస్కరించిన సందర్భంలోనూ ఇదే మొత్తంలో జరిమానా ఉంటుంది.

వివరాలు 

పరికరాలు, మందులు తప్పనిసరి

అంబులెన్స్‌లు కాంట్రాక్ట్‌ ఒప్పందంలో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మందులు, సిబ్బంది అందుబాటులో ఉండటం తప్పనిసరి.

వీటిలో ఏవైనా లోపించినా సంబంధిత సేవల నిర్వాహకులపై జరిమానా విధించనున్నారు.

అంబులెన్సులతో పాటు క్రేన్లు, పెట్రోలింగ్‌ వాహనాలు వంటి ఇతర ఆన్‌-రోడ్‌ యూనిట్ల నిర్వహణకు కూడా NHAI కొత్త నిబంధనలు రూపొందించింది.

NHAI కేర్‌ సిస్టమ్‌తో పర్యవేక్షణ

ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు NHAI 'కేర్‌ సిస్టమ్‌'ను ప్రవేశపెట్టింది.

దీని ద్వారా అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్‌ వాహనాల సేవలను పర్యవేక్షించడంతో పాటు.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అవి ఎంత వేగంగా చేరుకుంటున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

దేశవ్యాప్తంగా భారీ నెట్‌వర్క్

ప్రస్తుతం NHAI పరిధిలో సుమారు 50 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి.

వీటిపై దాదాపు 3,000 అంబులెన్సులు, 1,000 పెట్రోలింగ్‌ వాహనాలు, క్రేన్లు సేవలు అందిస్తున్నాయి.

వీటన్నింటిలో AIS-400 ప్రమాణాలకు అనుగుణమైన GPS పరికరాలను ఏర్పాటు చేశారు.

ప్రతి వాహనంలో IoT సిమ్‌తో కూడిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ సాంకేతిక వ్యవస్థల ద్వారా అత్యవసర వాహనాల పనితీరును అధికారులు పర్యవేక్షించనున్నారు.

1033కు ఫోన్‌ చేస్తే అత్యవసర సేవలు

జాతీయ రహదారులపై ప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు 1033 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

అలసత్వంపై చర్యలు తప్పవు

ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనలో జాప్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ, కాగ్‌ (CAG) ఆడిట్‌ నివేదికలు కూడా సూచించిన విషయాన్ని NHAI గుర్తుచేసింది.

అత్యవసర సేవల్లో జాప్యాన్ని అరికట్టేందుకు రూపొందించిన కొత్త మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని NHAI అన్ని ప్రాజెక్టు డైరెక్టర్లు, రీజినల్‌ ఆఫీసర్లను ఆదేశించింది.

నిబంధనల అమలులో నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.

జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం.

ADVERTISEMENT