నక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్‌లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు
2018లో మావోయిస్టులు నరేష్ సింగ్ భోక్తాను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి బిహార్, జార్ఖండ్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం తెలిపింది. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు నరేష్ సింగ్ భోక్తాను ప్రజా కోర్టులో హత్య చేశారు. బిహార్లోని ఔరంగాబాద్ జిల్లా మదన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బధాయి బిఘా గ్రామ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో బిహార్లోని గయా, ఔరంగాబాద్ జిల్లాలు, జార్ఖండ్లోని పలాము జిల్లాలో నిందితులు, అనుమానిత వ్యక్తుల ఇళ్లలో బుధవారం బుధవారం ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా నేరారోపణ పత్రాలతో పాటు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్లు వివిధ డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 9మంది అరెస్టు
గతేడాది జూన్ 24న బిహార్ పోలీసుల నుంచి ఈ కేసును ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఐఏ భారతీయ శిక్షాస్మృతి, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అజయ్ సింగ్ భోక్తా అనే నిందితుడిపై అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఎన్ఐఏ తన దర్యాప్తులో భోక్తా హత్య కుట్రలో అగ్ర నక్సల్ కమాండర్ల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. అనంతరం హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంది.