దావూద్ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ రూపొందించి కేంద్ర హోంశాఖకు సమర్పించింది. చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ సంచలన విషయాలను వెల్లడించింది. 1990లలో దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్‌ను ఎలా నిర్మించుకున్నాడో, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన టెర్రర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వ్యూహాన్ని అవలంబించాడని ఎన్ఐఏ ఛార్జిషీట్‌లో పేర్కొంది. లారెన్స్ బిష్ణోయ్ టెర్రర్ సిండికేట్ అనేది వాంటెడ్ టెర్రరిస్ట్, డ్రగ్ కింగ్‌పిన్ దావూద్ ఇబ్రహీం లాగే అపూర్వమైన రీతిలో విస్తరించిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. మొదట చిన్న చిన్న నేరాలకు పాల్పడిన లారెన్స్ బిష్ణోయ్, తరువాత తన సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఉత్తర భారతదేశంలో 700మందికి పైగా షూటర్లు ఉన్నారు. వారిలో 300మంది పంజాబ్‌లోనే ఉన్నారు.
బిష్ణోయ్ గ్యాంగ్‌లోకి సోషల్ మీడియా ద్వారా యువకులు రిక్రూట్
తన అనుచరుడు గోల్డీ బ్రార్ సహాయంతో పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌లకు లారెన్స్ బిష్ణోయ్ తన నెట్‌వర్క్‌ను విస్తరించగలిగాడు. సోషల్ మీడియా ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్‌లోకి యువకులు రిక్రూట్ చేయబడుతారని ఎన్ఐఏ తెలిపింది. తన గ్యాంగ్‌లో చేరిన యువకులకు కెనడా టూర్‌ను కూడా బిష్ణోయ్ ఆఫర్ చేస్తాడని వెల్లడించింది. లారెన్స్ బిష్ణోయ్ ఖలిస్థాని ఉద్యమానికి తీవ్ర వ్యతిరేకి అని ఎన్ఐఏ చెప్పింది. పాకిస్థాన్‌లో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా, పంజాబ్‌లోని కొందరు ఖలిస్థానీ నాయకులను హతమార్చేందుకు బిష్ణోయ్ కొందరు షూటర్లను నియమించినట్లు ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.