Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలతో పలు కేసులు నమోదవడంతో ఆమె కొంతకాలంగా పరారీలో ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, గత నాలుగు రోజులుగా ఛత్రపతి శంభాజీనగర్ నగరంలోని నారేగావ్ ప్రాంతం కైజర్ కాలనీలోని ఒక ఫ్లాట్‌లో నిదా ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తలదాచుకుని ఉన్నారు. ఈ సమాచారంతో నాసిక్ ప్రత్యేక దర్యాప్తు బృందం, ఛత్రపతి శంభాజీనగర్ పోలీస్ కమిషనరేట్, నేరశాఖ బృందాలు రెండు రోజుల పాటు నిఘా పెట్టి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.
వివరాలు
కేసు నేపథ్యం:
అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి తరలింపు అనుమతి పొందారు. తదుపరి విచారణ కోసం నాసిక్‌కు తరలించారు. నాసిక్ టీసీఎస్ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ, తన సహోద్యోగి దానిశ్ షేక్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అయితే అతనికి ముందే వివాహం జరిగిన విషయం దాచిపెట్టాడని ఫిర్యాదు చేసింది. ఈ దానిశ్ షేక్ సోదరే నిదా ఖాన్. బాధితురాలి మతాన్ని అవమానిస్తూ, ఇస్లాం మతంలోకి మారాలని నిదా ఖాన్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే దానిశ్ వివాహితుడని విషయం నిదాతో పాటు మరో ఉద్యోగి తౌసిఫ్ అక్తర్ కూడా దాచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివరాలు
హెచ్‌ఆర్ హెడ్‌తో పాటు ఏడుగురి అరెస్ట్
ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మరో ఏడుగురు మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చి, తమ సీనియర్లు మానసికంగా,లైంగికంగా వేధించారని ఆరోపించారు. వారు హెచ్‌ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపారు. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు హెచ్‌ఆర్ హెడ్‌తో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌కు ముందు నిదా ఖాన్ తాను రెండు నెలల గర్భిణినని పేర్కొంటూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని నాసిక్ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు తాత్కాలిక ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.
వివరాలు
ఏప్రిల్ 9న నిదా ఖాన్‌ను సస్పెండ్ చేసిన సంస్థ
ఈ వివాదం బయటపడే మూడు నెలల ముందే ఆమెను నాసిక్ నుంచి ముంబైలోని మలాడ్, హిరానందాని కార్యాలయాలకు బదిలీ చేసినట్లు సమాచారం. ఒక జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 9న నిదా ఖాన్‌ను సంస్థ సస్పెండ్ చేసింది. అలాగే ఆమెకు సంస్థ అంతర్గత వ్యవస్థలను యాక్సెస్ చేయకుండా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. అయితే నిదా ఖాన్ హెచ్‌ఆర్ మేనేజర్ కాదని, నాయకత్వ బాధ్యతల్లో లేని ఒక సాధారణ 'ప్రాసెస్ అసోసియేట్' అని,, ఈ అంశంపై తమ అంతర్గత విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సంస్థ స్పష్టం చేసింది.