Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదం.. కాలువ దాటే క్రమంలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువను దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యాన్ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బాలిక సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 11 మంది ప్రయాణికులతో వ్యాన్ సాత్వస్ నుంచి కాడ్లావడ్‌కు బయలుదేరింది. సారంగ్‌పుర్ పట్టణ సమీపానికి చేరుకున్న సమయంలో మార్గంలో ఉన్న ఝిరి కాలువ భారీ వర్షాలకు పొంగిపొర్లుతోంది. కాలువలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పటికీ.. డ్రైవర్ వాహనాన్ని దాటించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహానికి వ్యాన్ అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది.
వివరాలు
గ్రామస్థులు డ్రైవర్‌ను ముందుగానే హెచ్చరించినట్లు తెలిపిన ప్రత్యక్ష సాక్షులు
ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రయాణికులు ఈదుకుంటూ బయటకు వచ్చి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.
మృతులంతా దేవాస్ ప్రాంతానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు.
కాలువలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉందని, వాహనంతో ముందుకు వెళ్లొద్దని గ్రామస్థులు డ్రైవర్‌ను ముందుగానే హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
అయినప్పటికీ వారి సూచనలను పట్టించుకోకుండా కాలువ దాటేందుకు ప్రయత్నించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.
తాళ్లను ఉపయోగించి కాలువలో సహాయక చర్యలు చేపట్టారు.
తీవ్రంగా గాలించిన అనంతరం బాలికతో పాటు మొత్తం తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.