Paper Leak: ప్రశ్నపత్రాల లీక్‌పై కేంద్రం కఠిన చర్యలు.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ దిశగా ప్రస్తుతం అమల్లో ఉన్న 2024 ప్రవేశపరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ)చట్టంలో కీలక సవరణలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, సంబంధిత ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రతిపాదిత సవరణల ప్రకారం,ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి శిక్షలను మరింత కఠినతరం చేయనున్నారు. ముఖ్యంగా పేపర్ లీక్ కేసుల్లో దోషులకు గరిష్ఠంగా 10ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10కోట్ల వరకు జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలు చేర్చినట్లు సమాచారం.
వివరాలు
శిక్షలు,జరిమానాలను గణనీయంగా పెంచాలని నిర్ణయించిన కేంద్రం
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం వ్యక్తిగతంగా ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
అదే వ్యవస్థీకృత నేరాల విషయంలో 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 కోటి వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.
తాజా సవరణలతో ఈ శిక్షలు, జరిమానాలను గణనీయంగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించి, అనంతరం ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
వివరాలు
ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు
పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు.
ఇందులో భాగంగా దిల్లీలో తొలి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఇప్పటికే ఏర్పాటైంది. త్వరలో మరో నాలుగు కోర్టులను కూడా ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
ఈ కోర్టుల పరిధిలోకి వచ్చే పేపర్ లీక్ కేసుల విచారణను మూడు నెలల్లో పూర్తి చేసి దోషులకు శిక్ష ఖరారు చేసేలా బిల్లులో ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.
ఈ ముసాయిదా బిల్లును వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: నరేంద్ర మోదీ
ఇటీవల నీట్ పేపర్ లీక్‌ను వ్యతిరేకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వేగవంతం చేసినట్లు సమాచారం.
లీకేజీలకు పాల్పడే వారిపై ఎలాంటి కనికరం చూపబోమని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో స్పష్టం చేశారు.
ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.