Loading...
Nitin Gadkari: గతంలో మాదిరిగా పనిచేయలేకపోతున్నా.. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి: గడ్కరీ
గతంలో మాదిరిగా పనిచేయలేకపోతున్నా.. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి: గడ్కరీ

Nitin Gadkari: గతంలో మాదిరిగా పనిచేయలేకపోతున్నా.. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి: గడ్కరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో మాదిరిగా తాను ఎక్కువగా పనిచేయలేకపోతున్నానని, బాధ్యతలను కొత్త తరానికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం (ఆగస్టు 25)నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత మూడు దశాబ్దాలుగా తాను నిరంతరం ప్రజాజీవితంలో కొనసాగుతున్నానని గడ్కరీ తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని,అనేక అవార్డులు కూడా అందుకున్నానని చెప్పారు. అయితే వయసు,పరిస్థితుల నేపథ్యంలో గతంలో మాదిరిగా ఇప్పుడు ఎక్కువగా పనిచేయడం సాధ్యం కావడం లేదన్నారు. అందుకే కొత్త తరానికి పనిచేసే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

యువ నాయకత్వానికి ప్రాధాన్యం

యువతకు పాత తరం మార్గదర్శకత్వం అందించాల్సిన బాధ్యత ఉందని గడ్కరీ అన్నారు.

భవిష్యత్తులో మహారాష్ట్రలోని ఏ గిరిజన గ్రామం కూడా విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉండకూడదని ఆయన ఆకాంక్షించారు.

రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ అభివృద్ధి స్పష్టంగా కనిపించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

మరోవైపు.. ఇటీవలే బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. నితిన్ నబిన్ నేతృత్వంలో 65 మంది సభ్యులతో కొత్త జాతీయ బృందాన్ని పార్టీ అధిష్ఠానం ఏర్పాటు చేసింది.

ఇందులో ఏకంగా 51 మంది కొత్తవారే ఉండటం గమనార్హం.

దీంతో బీజేపీ పాతతరం నేతల కంటే కొత్తతరం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తోందన్న చర్చకు మరింత బలం చేకూరింది.

వివరాలు 

సీనియర్ల స్థానంలో యువతకు మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం

ఇదే సమయంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గాన్ని కూడా త్వరలో విస్తరించే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు సీనియర్ నేతలను తప్పించి యువతకు అవకాశాలు కల్పించవచ్చన్న ఊహాగానాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే గడ్కరీ చేసిన 'బాధ్యతలను కొత్త తరానికి అప్పగించాల్సిన సమయం వచ్చింది' అనే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆయన వ్యాఖ్యలు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న చర్చకు మరింత ఊతమిచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సీనియర్ల స్థానంలో యువతకు మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారానికి గడ్కరీ వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT