Nitin Gadkari: ఈ-20పై డీప్‌ఫేక్ ప్రచారం.. హైకోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 (E20) ఇంధనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ20 పెట్రోల్ వల్ల తన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారంటూ కొందరు డీప్‌ఫేక్ వీడియోలు, అసత్య పోస్టులు ప్రచారం చేస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ప్రచారం తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని, ఇలాంటి పోస్టులు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. గడ్కరీ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు, ఈ తప్పుడు కంటెంట్ వ్యాప్తికి సహకరించిన మెటాతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికలపై సివిల్ దావా దాఖలు చేసేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది.
వివరాలు
ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎఫ్‌ఐఆర్
ఈ పరిణామం చోటుచేసుకునే ముందు,ఈ20 ఇంధన కార్యక్రమంపై కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో నాగ్‌పుర్‌లో నలుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
వీరిలో ప్రముఖ యూట్యూబర్,రాజకీయ నాయకుడు మనీష్ కశ్యప్‌తో పాటు హర్షిత్ రాఠీ, అంక్లేష్ ఇన్వతీ తదితరులు ఉన్నారు.
ఈ కేసు నమోదైన దాదాపు రెండు వారాల తర్వాత గడ్కరీ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఈ20 పెట్రోల్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఇంధనం వల్ల వాహనాల పనితీరు లేదా ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న ఆరోపణలను నితిన్ గడ్కరీ పలుమార్లు ఖండించారు.
వివరాలు
రైతులకు దాదాపు రూ.45 వేల కోట్ల మేర అదనపు ఆదాయం
భారత్ ప్రతి సంవత్సరం చమురు దిగుమతుల కోసం సుమారు రూ.22 లక్షల కోట్లు వెచ్చిస్తోందని, ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ఆయన వివరించారు.
అంతేకాకుండా, ఇథనాల్ ఉత్పత్తి విస్తరణతో దేశంలోని రైతులకు దాదాపు రూ.45 వేల కోట్ల మేర అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని గడ్కరీ పేర్కొన్నారు.
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఇది ఉద్దేశపూర్వకంగా నిర్వహిస్తున్న పెయిడ్ క్యాంపెయిన్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ ప్రచారంలో ప్రచారం చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవని ఆయన మరోసారి వెల్లడించారు.