Nitish Kumar: నేడు బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆయన ప్రమాణ స్వీకార వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీయే నాయకులంతా హాజరవుతున్నట్టు సమాచారం. బుధవారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్‌ను ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశారు. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఆయన పేరును ప్రతిపాదించగా,ఎన్డీయే ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్‌ను ఎన్నుకున్నారు. తర్వాత నితీష్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను కలిసి,రాజీనామాను సమర్పించి,కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ రోజు నితీష్ కుమార్‌తో పాటు మొత్తం 18 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు.
వివరాలు
35 స్థానాలకు పరిమితమైన ''మహాఘట్బంధన్''
ఇక ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విశేష విజయాన్ని సాధించింది. మొత్తం 234 స్థానాల్లో, బీజేపీ-జేడీయూల కూటమి 202 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 89 సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలవగా, జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని ఎల్జెపి (ఆర్వి) 19 సీట్లపై విజయం సాధించగా, హెచ్ఎఎమ్‌కు ఐదు, ఆర్ఎల్ఎంకు నాలుగు సీట్లు దక్కాయి. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌ల ''మహాఘట్బంధన్'' మాత్రం కేవలం 35 స్థానాలకు పరిమితమైంది. ఆర్జేడీ 25 సీట్లు మాత్రమే గెలవడంతో భారీ దెబ్బ తగిలింది.