Nitish Kumar: రాజ్యసభకు నితీశ్.. బీహార్‌లో సీఎం మార్పు ఖాయం!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో బీహార్‌లో నాయకత్వ మార్పు ఖాయం అయింది. గురువారం ఢిల్లీకి చేరుకున్న నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూనే తన నిర్ణయాన్ని వెల్లడించారు. "బీహార్‌లో నేను చాలా పనులు పూర్తి చేశాను. ఇకపై ఢిల్లీలోనే ఉండాలని భావిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తాను. కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు నియమితులవుతారని తెలిపారు. ఆయనతో పాటు జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఉన్నారు.
వివరాలు
ప్రధాని, హోంమంత్రిలో కీలక బేటీ
ఏప్రిల్ 13 తర్వాత బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని సంజయ్ ఝా ముందుగానే సంకేతాలిచ్చారు. నితీశ్ తాజా ప్రకటనతో ఈ మార్పు వేగం పుంజుకోనుంది. మరోవైపు, 'నితీశ్ మోడల్' పాలన కొనసాగుతుందని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కూటమి ఐక్యంగా ఉందని మంత్రి విజయ్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక భేటీ జరపనున్నారు. ఈసమావేశంలో బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా ఢిల్లీకి చేరుకున్నారు.