150 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసే యోచనలో ఎన్ఎంసీ
దేశంలోని దాదాపు 150మెడికల్ కాలేజీల గుర్తంపును రద్దు చేసే యోచనలో వైద్య నిపుణుల నియంత్రణ సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఉన్నట్లు తెలుస్తోంది. సరిపోని ఫ్యాకల్టీ లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్లే ఆ కాలేజీ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడినట్లు ఎన్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నిబంధనలు పాటించని కారణంగా 40మెడికల్ కాలేజీలు గుర్తింపు కోల్పోయాయి. ఈ జాబితాలో గుజరాత్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లోని మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఎన్ఎంసీ వర్గాలు తెలిపాయి. నేషనల్ మెడికల్ కమిషన్‌కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నెల రోజులుగా నిర్వహించిన తనిఖీలో సీసీటీవీ కెమెరాలు, ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ హాజరు విధానాల్లో, ఫ్యాకల్టీ రోల్స్‌లో లోపాలు బయటపడ్డాయి.
గుర్తింపు రద్దయిన కాలేజీలకు అప్పీల్ చేసుకునే అవకాశం
కళాశాలల్లో సరైన కెమెరా ఇన్‌స్టాలేషన్ లేకపోవడం, ప్రమాణాలను పాటించడం లేదని ఎన్ఎంసీ అధికారులు వెల్లడించారు. అధ్యాపకుల్లో చాలా పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. గుర్తింపు రద్దయిన కాలేజీలు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటి అప్పీల్‌ను 30రోజుల్లోగా ఎన్ఎంసీలో చేయవచ్చు. అప్పీలు తిరస్కరణకు గురైతే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆశ్రయించాల్సి ఉంటుంది. 150 సంస్థల గుర్తింపును ఒకేసారి రద్దు చేసే వైద్య విద్యలో సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.