LOADING...
Revanth Reddy: విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జిల్లాల పునర్విభజనకు కమిషన్‌: టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి 
టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జిల్లాల పునర్విభజనకు కమిషన్‌: టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

జిల్లాల పునర్విభజనపై అనవసర అపోహలకు తావివ్వొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పూర్తిగా హేతుబద్ధంగా, శాస్త్రీయంగా చేపడతామని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కమిషన్‌ ఆరు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుందని చెప్పారు. జిల్లాల పునర్విభజనపై వచ్చే బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరపనున్నట్లు తెలిపారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (టీజీఓ) కేంద్ర సంఘం 2026 డైరీ, క్యాలెండర్‌ను సీఎం సోమవారం ఆవిష్కరించారు.

వివరాలు 

ఒక జిల్లాలో ఒక్క నియోజకవర్గం.. మరో జిల్లాలో 14 నియోజకవర్గాలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో నచ్చిన విధంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేసి వెళ్లారని విమర్శించారు. ఒక జిల్లాలో ఒక్క నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్న పరిస్థితి ఉందన్నారు. పూర్తిగా అశాస్త్రీయంగా విభజన జరిగిందని వ్యాఖ్యానించారు. వరంగల్‌, హనుమకొండలను ఒకే జిల్లా చేయాలన్న డిమాండ్‌ వస్తోందని గుర్తుచేశారు. జిల్లాల సంఖ్య పెంచాలా? తగ్గించాలా? అన్నది తాను ఇప్పుడే చెప్పనని, కానీ హేతుబద్ధతే ప్రమాణమని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు కమిషనరేట్‌ సరిహద్దులకే మార్పులు చేశామని చెప్పారు. 'దొరల కోట' పేరుతో ఉన్న కమిషనరేట్‌కు రాచకొండ అనే పేరు సహేతుకంగా లేదని భావించి మార్పు చేశామని వివరించారు.

వివరాలు 

మనమంతా ఒకే కుటుంబం

సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారన్న ప్రచారం జరుగుతోందని సీఎం ప్రస్తావించారు. మనమంతా ఒకే కుటుంబమని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులు వాటిని అమలు చేస్తారని చెప్పారు. కలిసి ముందుకు సాగితే అసూయపడే వారు తప్పక ఉంటారని అన్నారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన అప్పులు, తప్పిదాలను భరిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపులను పెంచుతామని హామీ ఇచ్చారు.

Advertisement

వివరాలు 

మనమంతా ఒకే కుటుంబం

గతంలో జీతాలు ఎప్పుడు వచ్చేవో, ఇప్పుడు ఎలా వస్తున్నాయో ఉద్యోగులు గమనించాలని సూచించారు. ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి ఇక్కడికి వచ్చానని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.కోటి బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకంపై కూడా చర్చ జరుగుతోందన్నారు. గతంలో నెలకు రూ.200 కోట్లకూ బకాయిల చెల్లింపులు జరగలేదని, ఇప్పుడు రూ.750 కోట్లు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు రూ.12 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ చెల్లింపులను మరింత పెంచుతామని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

మనమంతా ఒకే కుటుంబం

రాష్ట్ర ఆదాయం పెంచేందుకు పన్నులు పెంచాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. జీఎస్టీ, ఎక్సైజ్‌, ఇసుక, భూముల వ్యవహారాల్లో జరుగుతున్న అవకతవకలను అరికడితేనే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. నగరాల్లో ఇంటి పన్ను సక్రమంగా వసూలు చేస్తే ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారుతుందని వ్యాఖ్యానించారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా టీజీఓలు హైదరాబాద్‌లో కార్యాలయం నిర్మించుకోవాలని సూచించారు.

వివరాలు 

ఉద్యోగులే ప్రభుత్వానికి ఆధారం

పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించని రూ.11 వేల కోట్ల భారాన్ని తమపై మోపిందని సీఎం విమర్శించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.42 వేల కోట్లుగా ఉన్నాయని చెప్పారు. సింగరేణి, విద్యుత్‌ శాఖ తదితర విభాగాలను కలుపుకుంటే మొత్తం బకాయిలు రూ.1.11 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. వీటికి బ్యాంకు రుణాల భారం అదనమని చెప్పారు. అందుకే అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టామని వివరించారు.

వివరాలు 

ఉద్యోగులే ప్రభుత్వానికి ఆధారం

ప్రభుత్వం నడవాలంటే ప్రతి నెలా రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని, కొన్ని పథకాలను నిలిపివేసినా కనీసం రూ.22,500 కోట్ల ఖర్చు తప్పదన్నారు. అయితే ఆదాయం మాత్రం నెలకు రూ.18 వేల కోట్ల వరకే ఉందని చెప్పారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరని, 10.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే అసలైన సారథులని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారినప్పటికీ ఉద్యోగులు మాత్రం అదే విధంగా కొనసాగుతున్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

వివరాలు 

'అంతులేని కథ' సినిమాలా నా పరిస్థితి.. 

ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. చిన్నప్పుడే 'అంతులేని కథ' సినిమా చూసినట్లు గుర్తుచేశారు. ఆ సినిమాలో కుటుంబ బాధ్యతల కోసం జయప్రద తన ఆనందాన్ని పక్కనపెట్టి కష్టపడుతుందన్నారు. సీఎం పదవి వస్తే సంతోషంగా ఉండొచ్చని భావించానని, కానీ బాధ్యతలు మరింత పెరిగాయని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రోజుకు 12 గంటలు పనిచేస్తే సరిపోయేదని, ఇప్పుడు 18 గంటలు పనిచేసినా సమయం చాలడం లేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్‌, కోశాధికారి సహదేవ్‌, సహాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

వివరాలు 

ఎడ్యుకేషన్‌ కిట్‌ నాణ్యతలో రాజీ పడొద్దు: సీఎం 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్‌ కిట్ల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కేంద్రీకృతం,లోకల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాల్లో సమీకరించే వస్తువులపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు విద్యార్థుల చేతుల్లో కిట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

వివరాలు 

ఎడ్యుకేషన్‌ కిట్‌ నాణ్యతలో రాజీ పడొద్దు: సీఎం 

సోమవారం తన నివాసంలో సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల విద్యార్థులకు సరఫరా చేసే వస్తువుల ప్రొక్యూర్‌మెంట్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. యూనిఫాం, స్కూల్‌ బెల్ట్‌, టై, షూస్‌, బ్యాగ్‌, నోట్‌బుక్స్‌ తదితర వస్తువులు కిట్‌లో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులపై పూర్తి వివరాలు వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వేంనరేందర్‌రెడ్డి, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌, సీఎం కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement