Naravane Book: నరవణె పుస్తకంపై వివాదం.. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' ఇంకా ప్రచురణే కాలేదు: పెంగ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె రచించిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం చుట్టూ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో ఇప్పటికే కేసు నమోదు కాగా, ఈ నేపథ్యంలో ప్రచురణకర్త Penguin Random House India కీలక ప్రకటన చేసింది. నరవణె పుస్తకానికి తమకే ప్రత్యేక ప్రచురణ హక్కులు ఉన్నాయని, ఇప్పటివరకు ఒక్క కాపీ కూడా ముద్రించలేదని స్పష్టం చేసింది. అలాగే డిజిటల్ రూపంలోనూ అందుబాటులో పెట్టలేదని, ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నవి అన్నీ అనధికారిక కాపీలేనని పేర్కొంది.
వివరాలు
పుస్తకం ఎక్కడైనా కనిపిస్తే.. కాపీరైట్ హక్కుల ఉల్లంఘనగానే
నరవణె రాసిన Four Stars of Destinyను తాము ఇంకా ముద్రించలేదని, పీడీఎఫ్ సహా ఏ రూపంలోనూ పంపిణీ చేయలేదని పెంగ్విన్ వెల్లడించింది. ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపాల్లో ఈ పుస్తకం ఎక్కడైనా కనిపిస్తే అది తమ కాపీరైట్ హక్కుల ఉల్లంఘనగానే పరిగణించాల్సి ఉంటుందని, అటువంటి కాపీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయని కూడా తెలిపింది. ఇదిలా ఉండగా,ఈ పుస్తకం సోషల్ మీడియా వేదికలు మరియు ఆన్‌లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని సీరియస్‌గా తీసుకున్న దిల్లీ పోలీస్ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
వివరాలు
పెంగ్విన్ సంస్థ స్పష్టత
పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రచురణకు ముందే సిద్ధమైన పీడీఎఫ్ ప్రతులు కొన్ని వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పెంగ్విన్ సంస్థ స్పష్టత ఇచ్చింది. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించిన వివాదాస్పద అంశాలు పుస్తకంలో ఉన్నందున, దీనికి రక్షణ మంత్రిత్వశాఖ నుంచి ప్రచురణ అనుమతి లభించలేదని సమాచారం. అయినప్పటికీ, ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని లోక్‌సభకు తీసుకురావడం తీవ్ర చర్చకు దారి తీసింది. పుస్తకాన్ని ప్రధానికి అందిస్తానని రాహుల్ వ్యాఖ్యానించడంతో సభా కార్యకలాపాలు అంతరాయం కలిగినట్టుగా మారింది.