Supreme Court: జీపీఎస్ లేకపోతే పర్మిట్ రద్దవుతుందా? ఆటోలు, క్యాబ్‌లు, బస్సులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలని భావించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజా రవాణా వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లు, పానిక్ బటన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ఆటోలు, ట్యాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్‌లు, బస్సులు, స్కూల్ వాహనాలు సహా అన్ని కమర్షియల్ ప్రయాణికుల వాహనాలపై ప్రభావం చూపనున్నాయి. జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ సందర్భంగా ప్రస్తుతం దేశంలో ఒక శాతం కన్నా తక్కువ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లోనే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌లు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
'వాహన్' పోర్టల్‌లో ఈ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి: సుప్రీం
కేంద్ర మోటార్ వాహనాల నియమావళి 1989లోని రూల్ 125Hను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశించింది. ఇకపై జీపీఎస్ ట్రాకింగ్ డివైస్‌లు, ఎమర్జెన్సీ పానిక్ బటన్లు లేని ప్రజా రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదా ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ 'వాహన్' పోర్టల్‌లో కూడా తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాల వల్ల యాప్ క్యాబ్ సేవలు, ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులు, ఆటోరిక్షాలు, కమర్షియల్ వాన్‌లు, స్కూల్ వాహనాల యజమానులపై అదనపు ఖర్చు, నిబంధనల భారం పడే అవకాశం ఉంది. అయితే మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ఇది కీలక నిర్ణయమని భావిస్తున్నారు.
వివరాలు
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సహాయం కోసం పానిక్ బటన్
వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్‌ల ద్వారా వాహనాల రియల్ టైమ్ లొకేషన్‌ను అధికారులు పర్యవేక్షించవచ్చు. పానిక్ బటన్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సహాయం కోసం ఉపయోగించేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా నగరాల్లో క్యాబ్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై వస్తున్న ఆందోళనల మధ్య కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వాహనాల తయారీ దశలోనే జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లు, పానిక్ బటన్లు అమర్చే అంశాన్ని కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. దీనిపై ఆటోమొబైల్ కంపెనీలతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇది అమల్లోకి వస్తే వాహన యజమానులపై ఉన్న బాధ్యత తయారీ సంస్థలకే మారే అవకాశం ఉంది.
వివరాలు
జాతీయ రోడ్డు భద్రతా బోర్డు ఏర్పాటుపై సుప్రీం
దేశంలో రోడ్డు భద్రత పరిస్థితిపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో సరైన లేన్ డ్రైవింగ్ వ్యవస్థ లేకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది. స్పీడ్ గవర్నర్లు అమలు విషయంలో పలు రాష్ట్రాలు నివేదికలు సమర్పించకపోవడంపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా జాతీయ రోడ్డు భద్రతా బోర్డు ఇప్పటికీ ఏర్పాటు కాలేదని కోర్టు గుర్తుచేసింది. దీనికి చివరి అవకాశం ఇస్తూ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.