Loading...
Hyderabad: ఇక ఇమిగ్రేషన్‌కు క్యూలు అవసరం లేదు.. 10 నిమిషాల్లో విదేశీ ప్రయాణం!
ఇక ఇమిగ్రేషన్‌కు క్యూలు అవసరం లేదు.. 10 నిమిషాల్లో విదేశీ ప్రయాణం!

Hyderabad: ఇక ఇమిగ్రేషన్‌కు క్యూలు అవసరం లేదు.. 10 నిమిషాల్లో విదేశీ ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ఇమిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన 'ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్' (FTI-TTP) విధానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచి ఫలితాలు ఇస్తోంది. గత ఏడాది జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సేవలను వర్చువల్‌గా ప్రారంభించగా, ఈ ఏడాది జూన్ 30 నాటికి 78,547 మంది ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.

వివరాలు

ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ఎలా పనిచేస్తుంది?

శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ప్రయాణానికి నెల రోజుల ముందే తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది.

దీనికోసం [https://ftittp.mha.gov.in](https://ftittp.mha.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లి...

పాస్‌పోర్టు వివరాలు,

విమాన టికెట్ సమాచారం అప్‌లోడ్ చేయాలి.

అనంతరం ప్రయాణికులు తమ వేలిముద్రలను శంషాబాద్ విమానాశ్రయం లేదా విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO)లో నమోదు చేయాలి.

వివరాలు

ఈ-గేట్ ద్వారా నిమిషాల్లో ఇమిగ్రేషన్

ప్రయాణం రోజున చెక్-ఇన్ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఈ-గేట్ వద్దకు వెళ్లి పాస్‌పోర్టు, బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తే ప్రయాణికుడి వివరాలు వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ధృవీకరణ పూర్తికాగానే ఈ-గేట్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. విదేశాలకు వెళ్లే, తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో మొత్తం 8 ఈ-గేట్లు ఏర్పాటు చేశారు.

దీంతో గతంలో ఇమిగ్రేషన్ ప్రక్రియకు 60 నుంచి 90 నిమిషాలు పట్టగా, ఇప్పుడు సుమారు 10 నిమిషాల్లోనే పూర్తి అవుతోంది.

ADVERTISEMENT

వివరాలు

పత్రాల ధృవీకరణలోనూ ప్రయోజనం

సౌదీ అరేబియా, దుబాయ్, మస్కట్, అబుధాబి వంటి దేశాలకు వెళ్లే చాలామంది ప్రయాణికులు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఏర్పాట్లు చేసుకుంటుంటారు.

అయితే కొన్నిసార్లు పాస్‌పోర్టు, టికెట్ ఉన్నప్పటికీ అవసరమైన ఇతర పత్రాలను మర్చిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్‌లో ముందుగానే నమోదు చేసుకుంటే, వెబ్‌సైట్ అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచిస్తుంది.

సెల్ఫీ లేదా పత్రాలు సరిగా లేకపోతే వాటిని మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిందిగా తెలియజేస్తుంది. అన్ని వివరాలు సక్రమంగా పూర్తయిన తర్వాతే ప్రయాణికుడి సమాచారం సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ అధికారులకు చేరుతుంది.

దీంతో పత్రాల్లో పొరపాట్లు తగ్గడమే కాకుండా, ప్రయాణికుల ఇమిగ్రేషన్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తవుతోంది.

ADVERTISEMENT