LOADING...
Telangana: ఆర్టీఏకి వెళ్లాల్సిన అవసరం లేదు.. వాహన్ పోర్టల్‌తో అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే!
వాహన్ పోర్టల్ షురూ.. ఇక ఆన్లైన్లోనే ఆర్టీఏ సేవలు

Telangana: ఆర్టీఏకి వెళ్లాల్సిన అవసరం లేదు.. వాహన్ పోర్టల్‌తో అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటివరకు వాహనాలకు సంబంధించిన లైసెన్స్, రిజిస్ట్రేషన్, కరెక్షన్లు, పేరు మార్పులు వంటి పనుల కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పైగా ఏజెంట్ల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ కష్టాలకు ముగింపు పలుకుతూ ప్రభుత్వం వాహన్ పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వాహనదారులు ఇంటి నుంచే తమ పనులను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడింది. సోమవారం(మార్చి 23)రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాహన్ పోర్టల్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభంతో తెలంగాణ రవాణా సేవలు జాతీయ వాహన్ పోర్టల్‌లో చేరాయి. ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్,ఓనర్‌షిప్ బదిలీ వంటి సేవలు ఆన్‌లైన్ ద్వారా సులభంగా పొందవచ్చు.

వివరాలు 

జాతీయ డేటాబేస్‌లోకి తెలంగాణ వాహనాల సమాచారం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాహన్ పోర్టల్‌లో తెలంగాణ చేరడంతో రాష్ట్రంలోని అన్ని వాహనాల వివరాలు జాతీయ స్థాయి డేటాబేస్‌లో నమోదు కానున్నాయి. దీని వల్ల ఆర్టీఏ కార్యాలయాలపై పని భారం తగ్గడంతో పాటు, ఇతర రాష్ట్రాలకు వాహనాల బదిలీ ప్రక్రియ కూడా మరింత సులభం కానుంది. వాహనదారులకు ఊరటనిచ్చే మరో కీలక నిర్ణయం కూడా అమల్లోకి వచ్చింది. మార్చి 23 నుంచి రెండో వాహనంపై విధిస్తున్న 2 శాతం లైఫ్ టాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కాలుష్య నియంత్రణ కోసం గతంలో ఈ పన్ను అమలు చేసినప్పటికీ, ఇప్పుడు దాన్ని తొలగించడం వల్ల కొత్తగా వాహనాలు కొనేవారికి, ఇప్పటికే వాహనాలు ఉన్న వారికి కూడా ప్రయోజనం కలగనుంది.

వివరాలు 

దశలవారీగా సేవల విస్తరణ

ప్రస్తుతం మొదటి దశలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సేవలను మాత్రమే ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. త్వరలోనే మిగతా సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు, సిబ్బంది, ఆటోమొబైల్ డీలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సాంకేతిక సమస్యలు లేకుండా సేవలు అందించేలా సిద్ధం చేశారు.

Advertisement

వివరాలు 

దేశవ్యాప్తంగా వాహన బదిలీ ఇక సులభం

వాహన్ పోర్టల్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, వాహనదారులు మొత్తం 52 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారానే పొందగలుగుతారు. ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఓనర్‌షిప్ బదిలీ ప్రక్రియను కూడా ఇంటి నుంచే పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాల మధ్య లేదా జిల్లాల మధ్య వాహన బదిలీలకు ఇకపై ఎన్‌ఓసీ అవసరం ఉండదు. దరఖాస్తు చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోనే బదిలీ పూర్తయ్యే విధంగా వ్యవస్థను రూపొందించారు. వాహనాలు దొంగతనం జరిగినా లేదా ప్రమాదాలకు గురైనా వాటి వివరాలను సులభంగా గుర్తించేందుకు కూడా ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

Advertisement