LOADING...
RERA: 500 చదరపు గజాల్లోపు నిర్మాణాలకు రెరా వర్తించదు: అప్పిలేట్ ట్రైబ్యునల్
500 చదరపు గజాల్లోపు నిర్మాణాలకు రెరా వర్తించదు: అప్పిలేట్ ట్రైబ్యునల్

RERA: 500 చదరపు గజాల్లోపు నిర్మాణాలకు రెరా వర్తించదు: అప్పిలేట్ ట్రైబ్యునల్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదు వందల చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని తెలంగాణ రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. రెరా చట్టంలోని సెక్షన్ 3(2)(ఎ) ప్రకారం 500 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మాణం చేసినా లేదా ఎనిమిది కంటే తక్కువ ఫ్లాట్లు మాత్రమే నిర్మించినా, అటువంటి ప్రాజెక్టులకు రెరా నమోదు అవసరం ఉండదని పేర్కొంది. ఈ రెండు నిబంధనల్లో ఏదో ఒకటి వర్తించినా సరే, రెరా రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉంటుందని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తరహా నిర్మాణాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు, తమ సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టు లేదా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చని సూచించింది.

వివరాలు 

నిర్మాణ సంస్థ జరిమానాగా రూ.2,82,276 చెల్లించాలని తీర్పు

హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ వజ్ర రెసిడెన్సీకి చెందిన డెవలపర్ ఆర్ ఆర్ కన్స్ట్రక్షన్, ఒప్పందం ప్రకారం సమస్యలను పరిష్కరించకపోవడమే కాకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందజేయలేదంటూ వీణాధరి రెరాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రెరా, అపార్ట్‌మెంట్‌లో ఉన్న లోపాలను సరిదిద్దాలని, అసోసియేషన్‌కు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని, అలాగే జరిమానాగా రూ.2,82,276 చెల్లించాలని నిర్మాణ సంస్థను ఆదేశిస్తూ గత ఏడాది జూలైలో తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇరుపక్షాలు రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఛైర్మన్ ఏ. సంతోష్ రెడ్డి, న్యాయ సభ్యులు పి. ప్రదీప్ కుమార్ రెడ్డి, పాలనా సభ్యులు చిత్రా రామచంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారించింది.

వివరాలు 

రెండు ఫ్లాట్లుగా విభజన 

నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 459 చదరపు గజాల విస్తీర్ణంలో స్టిల్ట్‌తో పాటు నాలుగు అంతస్తుల్లో మొత్తం ఎనిమిది ఫ్లాట్ల నిర్మాణానికి అనుమతి తీసుకుని అదే ప్రకారం పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే స్థల యజమానికి చెందిన రెండో,నాలుగో అంతస్తుల్లో నిర్మాణాలను మార్పులు చేసి వాటిని రెండు ఫ్లాట్లుగా విభజించుకున్నారని వివరించారు. 500 చదరపు గజాల లోపు స్థలం లేదా ఎనిమిది యూనిట్లకు మించని నిర్మాణాలకు రెరా చట్టం వర్తించదని చట్టంలో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ,500చదరపు గజాల నిబంధన వర్తించకపోయినా మొత్తం పది ఫ్లాట్లు ఉన్నందున ఈ నిర్మాణం రెరా పరిధిలోకి వస్తుందని, అందువల్ల చర్యలు తీసుకోవచ్చని వాదించారు.

Advertisement

వివరాలు 

రెరా గతంలో ఇచ్చిన తీర్పు రద్దు

ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం, డెవలపర్ 500 చదరపు గజాల లోపు స్థలంలోనే నిర్మాణం చేపట్టినందున ఈ ప్రాజెక్టుకు రెరా చట్టం వర్తించదని తేల్చి చెప్పింది. అందువల్ల ఈ నిర్మాణాలపై రెరాకు నియంత్రణ ఉండదని పేర్కొంటూ, రెరా గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇలాంటి నిర్మాణాల్లో బాధితులు తమ సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టు లేదా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చని మరోసారి స్పష్టం చేసింది.

Advertisement