AP Rajyasabha Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు.. పోటీ నుండి తప్పుకున్న నాగబాబు
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తాజా పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న అభ్యర్థుల స్థానంలో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక వైపు జనసేన పార్టీ తరఫున సినీనటుడు నాగబాబు రాజ్యసభ అభ్యర్థిత్వానికి దూరమయ్యారు. ఆయన రాజ్యసభకు పోటీ చేయడాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ముందుగా మోపిదేవి స్థానంలో ఆయనకు అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది, కానీ పదవీ కాలం తక్కువగా ఉండటంతో పాటు, ఎన్నికల ప్రక్రియను ఎదుర్కోకుండా రాజ్యసభకు వెళ్లడంపై నాగబాబు ఆసక్తి చూపించడం లేదని సమాచారం.
నాగబాబు స్థానంలో సాన సతీష్
గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి కేటాయించడంతో నాగబాబు మనస్తాపానికి గురై, పార్టీలో పాల్గొనకుండా హైదరాబాద్ వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. అయితే, ఏపీలో తాజా రాజ్యసభ ఎన్నికలు జరగడంతో నాగబాబు పేరును ఒకసారి మళ్లీ తెరపై ఉంచారు. కానీ, మోపిదేవి పదవీ కాలం 2సంవత్సరాలకు మించి ఉండకపోవడంతో,జనసేన వర్గాలు నాగబాబు రాజ్యసభకు పోటీ చేయరని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని,నాగబాబు స్థానంలో సాన సతీష్ పేరును ప్రచారం చేస్తున్నారు. ఈ అభ్యర్థిత్వంపై టీడీపీ, జనసేన పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రాజ్యసభకి రాజీనామా చేసిన బీద మస్తానరావుకు మరో అవకాశం ఇవ్వాలని టీడీపీ తేల్చి చెప్పింది. దీంతో,టీడీపీ నుంచి బీద మస్తానరావు లేదా సాన సతీష్ ఎంపిక అవుతారని తెలుస్తోంది.
రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల
బీజేపీ తరఫున ఆర్. కృష్ణయ్య పేరును కూడా ప్రచారం చేస్తున్నారు. గల్లా జయదేవ్ పేరు కూడా వినిపించింది, కానీ తాజా రాజకీయ పరిణామాలతో బీజేపీ కూడా కొత్త వ్యక్తులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ తరుణంలో, పేర్లపై ఇంకా నిర్ణయం తీసుకోవడానికి సమయం అవసరమవుతుంది. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల గడువు డిసెంబర్ 10 వరకు ఉంది. ఈ ఎన్నికల నేపథ్యంతో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో అభ్యర్థిత్వంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా
ఏపీలో ఇప్పటికే వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పేర్లు ఉన్నాయి. ఈ జనవరి నుంచి రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. సమావేశంలో, రాజ్యసభ ఎన్నికల తేదీ డిసెంబర్ 20 ఉండగా, కౌంటింగ్ డిసెంబర్ 24 జరుగనుంది.