LOADING...
PM Modi: పాములు పట్టే వాడిలా మోడీ కార్టూన్.. నార్వే పత్రిక తీరుపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ
నార్వే పత్రిక తీరుపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ

PM Modi: పాములు పట్టే వాడిలా మోడీ కార్టూన్.. నార్వే పత్రిక తీరుపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓస్లోలో సోమవారం నిర్వహించిన ఉమ్మడి ప్రతినిధుల సమావేశం అనంతరం పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్నను నార్వేకు చెందిన మహిళా విలేకరి హెల్లే ల్యాంగ్ అడగగా, ప్రధాని మోదీ స్పందించకుండా వెళ్లిపోయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే మంగళవారం నార్వేలో ప్రముఖ దినపత్రికగా గుర్తింపు పొందిన 'ఆఫ్టెన్‌పోస్టెన్' ప్రచురించిన ఒక వ్యంగ్య చిత్రం కొత్త వివాదానికి కారణమైంది. ఆ కార్టూన్‌లో ప్రధాని మోదీని పాములు ఆడించే వ్యక్తిలా చిత్రీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

ఒక తెలివైన, కానీ కొంచెం చిరాకు తెప్పించే వ్యక్తి

గ్యాస్ కేంద్రానికి సంబంధించిన ఇంధన గొట్టాన్ని పాముగా చూపిస్తూ, దానిని ఊదుతూ ఆడిస్తున్నట్టుగా ప్రధాని రూపాన్ని చూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కార్టూన్ రూపొందించినట్లు భావిస్తున్నారు. జర్నలిస్ట్ ఫ్రాంక్ రోసావిక్ రాసిన విశ్లేషణాత్మక కథనానికి జతగా ఈ బొమ్మను ప్రచురించారు. అంతేకాకుండా "ఒక తెలివైన, కానీ కొంచెం చిరాకు తెప్పించే వ్యక్తి" అనే వ్యాఖ్యను కూడా అందులో పొందుపరచడం మరింత విమర్శలకు దారితీసింది. ఈ చిత్రం వైరల్ కావడంతో భారతీయ నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు నార్వే పత్రిక తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

వివరాలు 

నార్వే పత్రిక వెంటనే క్షమాపణ చెప్పాలి 

అధికారిక పర్యటనకు వచ్చిన ఒక ప్రజాస్వామ్య దేశ ప్రధానిని పాత వలసవాద భావజాలాన్ని గుర్తుచేసే రీతిలో అవమానించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పత్రికా స్వేచ్ఛ కాదని, స్పష్టమైన జాతి వివక్షకు ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో పాశ్చాత్య మీడియా భారతదేశ ఎదుగుదలపై ఇటువంటి కార్టూన్లు వేసినప్పుడు ప్రధాని మోదీ స్పందిస్తూ.. "భారత్ ఇప్పుడు పాములు ఆడించే దేశం కాదు.. ప్రపంచాన్ని సాంకేతిక శక్తితో ప్రభావితం చేసే దేశం" అని చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు మరోసారి గుర్తు చేస్తున్నారు. నార్వే పత్రిక వెంటనే క్షమాపణ చెప్పాలని సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement