Kerala HC: ఉద్యోగి రాజీనామా నిరాకరణ బానిసత్వంతో సమానం: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల హక్కుల విషయంలో కేరళ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వ్యక్తిగత కారణాలు గానీ, ఇతర అవసరాల గానీ ఉన్నప్పుడు ఒక ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తే, ఆ నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకోవడానికి యాజమాన్యాలకు హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది. రాజీనామాను ఉద్దేశపూర్వకంగా ఆమోదించకుండా నిలిపివేయడం అనేది ఆ ఉద్యోగిని బానిసలా వ్యవహరించినట్లేనని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు గట్టి ఊరటనిచ్చే అంశంగా మారింది.
వివరాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రస్తావన..
ఈ తీర్పు సందర్భంగా న్యాయమూర్తి భారత రాజ్యాంగంలోని 23వ అధికరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో వెట్టిబానిసత్వం, బలవంతపు శ్రమను రాజ్యాంగం పూర్తిగా నిషేధించిందని గుర్తుచేశారు. ఒక ఉద్యోగి తన స్వచ్ఛంద నిర్ణయంతో సంస్థ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకుంటే, ఉద్యోగ ఒప్పందంలో స్పష్టమైన, బలమైన చట్టపరమైన షరతులు లేకపోతే, అతడిని బలవంతంగా ఉద్యోగంలో కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
వివరాలు
అసలీ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏంటంటే?
ఈ వ్యవహారంలో పిటిషనర్ ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. 2020లో ఆయన తండ్రి మరణించడంతో, అప్పటి నుంచి ఆయన తల్లి తీవ్రమైన మానసిక, నాడీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తల్లిని దగ్గరగా ఉండి చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి సమీపంలోనే మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాలని పిటిషనర్ నిర్ణయించారు. దీనికనుగుణంగా ఆయన తన రాజీనామా పత్రాన్ని యాజమాన్యానికి సమర్పించారు. అయితే సంస్థ ఆర్థిక ఇబ్బందులు, పని భారం వంటి కారణాలను చూపిస్తూ ఆయన రాజీనామాను అంగీకరించలేదు. అంతేకాదు, 2022 అక్టోబర్ నుంచి ఆయనకు జీతం చెల్లింపును కూడా నిలిపివేసింది.
వివరాలు
హైకోర్టు ఆదేశాలు
రాజీనామా ఆమోదం లేకుండా మరో సంస్థలో ఉద్యోగం పొందలేని పరిస్థితి ఉండటంతో, పిటిషనర్ తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొని చివరకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. పిటిషనర్ వాదనలు, పరిస్థితులను పరిశీలించిన హైకోర్టు సంబంధిత సంస్థ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పిటిషనర్ రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిలిపివేసిన జీత బకాయిలు, గ్రాట్యుటీ, పీఎఫ్ సహా అతడికి రావలసిన అన్ని ప్రయోజనాలను లెక్కగట్టి, రెండు నెలల లోపు పూర్తిగా చెల్లించాలని ఆదేశించింది. ఉద్యోగ నియామక ఒప్పందంలో నిష్క్రమణకు సంబంధించి కఠినమైన చట్టపరమైన అడ్డంకులు లేనప్పుడు, యాజమాన్యాలు మొండిగా వ్యవహరించకూడదని కోర్టు హితవు పలికింది.