
DGCA: గత ఐదు సంవత్సరాలలో భారతదేశంలో 65 ఇంజిన్ వైఫల్యాలు, 17 మేడే కాల్స్ నమోదు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదైనట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఇటీవల అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం అనంతరం ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఉన్న ఇంజిన్‌లు,ఇంధన స్విచ్‌లు వంటి కీలక భాగాలపై అప్రమత్తంగా మారాయి. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.ఈ నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. 2024 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు మొత్తం 11 మే డే కాల్స్ నమోదయ్యాయని పేర్కొంది.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా విమానాలలో సాంకేతిక లోపాలు సాధారణమే..
విమానాల నుంచి మే డే కాల్స్ వచ్చినప్పటికీ పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆయా విమానాలను సురక్షితంగా భూమికి దించడంతో భారీ ప్రమాదాలు తప్పాయన్నది నివేదికలో పేర్కొంది. ఎక్కువగా పైలట్లు సమస్యలను ఎదుర్కొని పరిష్కరించినా,ప్రతి సందర్భంలోను ఇది సాధ్యపడదని డీజీసీఏ అభిప్రాయపడింది. భారత పైలట్ల సమాఖ్య అధ్యక్షుడు కెప్టెన్ సీఎస్ రాంధవా మాట్లాడుతూ, ఇంధన ఫిల్టర్లు మురికి కారణంగా బ్లాక్ కావడం, టర్బైన్‌లో లోపాలు రావడం, ఇంధన కాలుష్యం, ఇంజిన్‌లకు ఇంధన సరఫరా నిలిపిపోవడం వంటి అంశాలే ప్రధాన కారణాలుగా ఉన్నట్లు తెలిపారు. విమానాల సురక్షతకు సంబంధించి డీజీసీఏ ఎయిర్ సేఫ్టీ డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా విమానాలలో సాంకేతిక లోపాలు సాధారణమే అయినా,భారత విమానాల్లో ఇలాంటి సమస్యలు తరచూ ఎదురవ్వడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
వివరాలు
ఇంధన స్విచ్‌ల వైఫల్యం లాంటి లోపాలపై ప్రత్యేక దృష్టి
ఇంధన స్విచ్‌ల వైఫల్యమే అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన తరువాత, దేశవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల్లో ఇలాంటి లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జోసెఫ్ వెల్లడించారు. అహ్మదాబాద్ ఘటన తర్వాత బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థను తప్పనిసరిగా తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశించినట్లు ఆయన వివరించారు.