Telangana Gram Panchayat: ఇక గ్రామ పంచాయతీలకు సొంత బ్యాంకు ఖాతాలు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై పంచాయతీలు తమకు వచ్చే ఆదాయాలను నేరుగా సొంత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకోవచ్చు. ఇప్పటివరకు పంచాయతీలకు వచ్చే ఆదాయాలు, ఇతర నిధులను ట్రెజరీల ద్వారా ప్రభుత్వ ఖాతాలో జమ చేసే విధానం అమల్లో ఉంది. ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు గత శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.43ను జారీ చేసింది. కొత్త విధానం అక్టోబరు 9 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
వివరాలు
ట్రెజరీ విధానానికి స్వస్తి
పంచాయతీలకు నగదు రూపంలో అందే ఆదాయాలు, నిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ద్వారా వచ్చే మొత్తాలను కూడా వెంటనే సమీపంలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ గ్రామ పంచాయతీల నిధులను ట్రెజరీల ద్వారా విడుదల చేసే విధానం అమల్లో ఉంది.
ఈ విధానం వల్ల పంచాయతీలు తమ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు, సిబ్బంది జీతభత్యాలు, అత్యవసర పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రహదారుల నిర్మాణం, ఇతర స్థానిక అవసరాల కోసం నిధులు వినియోగించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.
వివరాలు
ట్రెజరీ విధానానికి స్వస్తి
అంతేకాకుండా ఆయా పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం పాత ట్రెజరీ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా గత శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ చేపట్టగా.. తాజాగా దానికి అనుగుణంగా పంచాయతీలు తమ సొంత బ్యాంకు ఖాతాల ద్వారా నిధులను నిర్వహించుకునేలా జీవో జారీ చేసింది.
ఈ నిర్ణయంపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. పల్లెల ఆర్థిక స్వావలంబన దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. కొత్త విధానంతో గ్రామ పంచాయతీలకు నిధుల వినియోగంలో మరింత స్వేచ్ఛ లభించనుంది.