NTA: ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 600 మంది సబ్జెక్ట్ నిపుణుల తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నారు. ఇందులో భాగంగా సుమారు 600 మంది సబ్జెక్ట్ నిపుణులను తొలగించి, వారి స్థానంలో కొత్త నిపుణులను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఎన్టీఏ సమీక్ష సమావేశంలో మంత్రి జోషి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షలను మరింత సమర్థంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన వ్యవస్థను పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో ఇకపై నాలుగు అంచెల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్.. మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించారు.
వివరాలు
ఎన్టీఏలోకి 25 మంది అధికారులు
ఈ విధానం ద్వారా ప్రశ్నాపత్రాల తయారీలో భద్రతను పెంచడంతో పాటు లోపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
పరీక్షల నిర్వహణలో సాంకేతిక, భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచనున్నట్లు వెల్లడించారు.
రాబోయే మూడు వారాల్లో సుమారు 25 మంది అధికారులను ఎన్టీఏలోకి తీసుకురానున్నట్లు డైరెక్టర్ జనరల్ తెలిపారు.
అలాగే సంస్థ కార్యాలయాలను కొత్త ప్రాంతాలకు తరలించే ప్రణాళిక కూడా ఉంది.
అవసరమైన భద్రతా చర్యలను చేపట్టడంతో పాటు సీఐఎస్ఎఫ్ దళాలను మోహరించేందుకు అనువుగా కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఎన్టీఏలో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని తొలగించిన అధికారులు
ఇటీవల నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్, పరీక్ష రద్దు వంటి పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ అంశాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ కార్యదర్శి,ఎన్టీఏ డైరెక్టర్‌తో సమావేశమయ్యారు.
పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను సమీక్షించి,భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థను మార్చాలని సూచించారు.
ప్రస్తుతం ఎన్టీఏలో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు.
అదే సమయంలో సంస్థలో కొత్తగా 10 ప్రొఫెషనల్ లీడర్‌షిప్ పోస్టులను ప్రకటించారు.
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్,చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, జనరల్ మేనేజర్ (టెస్ట్ సెక్యూరిటీ),ఆర్‌అండ్‌డీ జనరల్ మేనేజర్ వంటి కీలక పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నారు.
వివరాలు
పరీక్షల భద్రత మరింత పటిష్ఠం
ఎన్టీఏలో సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నాపత్రాల రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు మంత్రి జోషికి అధికారులు వివరించారు.
ముఖ్యంగా పరీక్షలకు సంబంధించిన రహస్య కార్యకలాపాల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా మార్చాలని మంత్రి ఆదేశించారు.
పరీక్షల భద్రతను మరింత పటిష్ఠం చేసి, నిర్వహణలో లోపాలను తగ్గించేలా సమగ్ర మార్పులు చేపట్టాలని స్పష్టం చేశారు.