Loading...
NTR Bharosa Pensions: అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్లు.. నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్లు.. నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

NTR Bharosa Pensions: అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్లు.. నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. సోమవారం నుంచి వారం రోజులపాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు 

అర్హత నిర్ధారణకు జీవో 174 ప్రామాణికం

కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునే వారి అర్హతను నిర్ధారించేందుకు 2019డిసెంబరులో వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవో 174ను అధికారులు ప్రామాణికంగా తీసుకోనున్నారు.

దరఖాస్తుదారుల వివరాలను ఆరు అంచెల విధానంలో పరిశీలిస్తారు.తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారికి కారణాలను వివరిస్తూ తిరస్కరణ పత్రాన్ని అందజేస్తారు.

వివిధ దశల్లో పరిశీలన పూర్తయి అర్హులుగా నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల ప్రకారం కేటగిరీల వారీగా,విడతల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణ నుంచి తనిఖీలు,అర్హుల ఎంపిక,ప్రభుత్వ ఆమోదం వరకు మొత్తం ప్రక్రియ ఈ నెల 7 నుంచి 20రోజుల్లో పూర్తి చేయనున్నారు.

ఆ తర్వాత పింఛను మంజూరు ఉత్తర్వులు వెలువడతాయి.అక్టోబరు 1 నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు.

వివరాలు 

ఆన్‌లైన్‌లో నమోదు.. ఈకేవైసీతో సరిపోల్చి పరిశీలన

కొత్త పింఛను దరఖాస్తు నమూనా రాష్ట్రంలోని అన్ని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో (ఎస్‌జీఎస్‌డబ్ల్యూ) అందుబాటులో ఉంటుంది.

ఎస్‌జీఎస్‌డబ్ల్యూ వెబ్‌సైట్‌తో పాటు ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా దరఖాస్తు నమూనాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణ బాధ్యతను సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్‌, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శికి అప్పగించారు.

దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత దరఖాస్తుదారుడికి రసీదు అందిస్తారు.

ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను ఈకేవైసీ డేటాతో బ్యాక్‌ఎండ్‌ సిస్టమ్‌ సరిపోల్చుతుంది.

వివరాలన్నీ సరిగ్గా ఉంటే దరఖాస్తు తదుపరి దశకు వెళుతుంది. ఏదైనా తేడా ఉంటే దరఖాస్తు అక్కడే నిలిచిపోతుంది.

ఈ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేసి, సరైన వివరాలు సమర్పించాలని సచివాలయ సిబ్బంది సూచిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆరు అంచెల తనిఖీ

దరఖాస్తుదారుల వివరాలను ఆరు దశల్లో పరిశీలిస్తారు. తనిఖీలో అనర్హులుగా తేలిన వారికి తిరస్కరణ పత్రం ఇస్తారు.

అర్హత ఉన్నట్లు గుర్తించిన దరఖాస్తులను సచివాలయ సిబ్బంది మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారిస్తారు.

దరఖాస్తుదారుడి ఈకేవైసీ నమోదు కాకపోయినా.. క్షేత్రస్థాయి తనిఖీకి వెళ్లే సచివాలయ సిబ్బంది వారి నుంచి అవసరమైన వివరాలను సేకరిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

వృత్తిపరమైన పింఛన్లకు ప్రత్యేక పరిశీలన

సచివాలయ స్థాయిలో అర్హత పొందిన దరఖాస్తుల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తులు ఎంపీడీవో లేదా మున్సిపల్‌ కమిషనర్‌ లాగిన్‌కు పంపిస్తారు.

ఒంటరి మహిళల పింఛను దరఖాస్తులు తహసీల్దారు లాగిన్‌కు వెళతాయి. చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చర్మకారులు, హిజ్రాల కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులను ఆయా శాఖల జిల్లా అధికారులకు పంపిస్తారు.

సంబంధిత అధికారులు పరిశీలన చేసిన తర్వాత దరఖాస్తులు తిరిగి ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్లకు చేరతాయి.

అక్కడ అర్హత ఉన్న దరఖాస్తులను కేటగిరీల వారీగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదిస్తారు.

ఆ స్థాయిలోనూ పరిశీలన పూర్తయ్యాక అర్హత పొందిన దరఖాస్తులన్నింటినీ సెర్ప్‌కు పంపిస్తారు.

వివరాలు 

సెర్ప్‌లో మరోసారి పరిశీలన

సెర్ప్‌లో కూడా దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తారు. అనంతరం పింఛన్ల మంజూరుకు అవసరమైన బడ్జెట్‌ కేటాయింపుల కోసం సంక్షేమ కార్పొరేషన్ల వారీగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు.

ప్రభుత్వం ఆమోదం, బడ్జెట్‌ విడుదల లేదా అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు.

మంజూరు ఉత్తర్వులు వచ్చిన నెల నుంచే పింఛను

సెర్ప్‌ ఏ నెల నుంచి పింఛను మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తుందో.. ఆ నెల నుంచే లబ్ధిదారులకు పింఛను అందుతుంది.

దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి లేదా గతంలోనే అర్హత సాధించిన తేదీ నుంచి బకాయిలను చెల్లించరు.

అర్హత పొందిన వారికి పింఛను మంజూరు ఉత్తర్వులను సచివాలయాల్లోని సంక్షేమ,విద్య సహాయకుడు లేదా వార్డు సంక్షేమ,అభివృద్ధి కార్యదర్శి అందజేస్తారు.

వివరాలు 

దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలివే..

కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ మొత్తాన్ని కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.

అన్ని కేటగిరీల పింఛన్లకు దరఖాస్తు చేసుకునే వారు ఆధార్‌ కార్డు, బియ్యం కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

భర్త మరణ ధ్రువీకరణ పత్రం, భర్త ఆధార్‌ నంబర్‌ అవసరం.

వివాహితులైతే కోర్టు లేదా అదాలత్‌ జారీ చేసిన విడాకుల పత్రం సమర్పించాలి. వివాహం కాని వారు పెళ్లి కాలేదని తహసీల్దారు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి.

కనీసం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించే సదరం సర్టిఫికెట్‌ అవసరం.

చేనేత, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చర్మకారులు, కల్లుగీత కార్మికుల పింఛన్లకు: సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.

వివరాలు 

రాష్ట్ర జనాభాలో 12.88 శాతం మందికి పింఛన్లు

హిజ్రాల పింఛను కోసం: జిల్లా మెడికల్‌ బోర్డు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం అవసరం.

అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి అందిస్తున్నామని పేర్కొంది.

దివ్యాంగుల పింఛనును రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లు వెల్లడించింది.

అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛను పొందని వారికి కూడా ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

వివరాలు 

రాష్ట్ర జనాభాలో 12.88 శాతం మందికి పింఛన్లు

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పింఛను మొత్తం, నెలవారీ వ్యయం, వార్షిక పింఛను వ్యయం అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 61.92 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు నెలకు రూ.2,693.90 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.

గత 26 నెలల్లో పింఛన్ల కోసం రూ.73,507 కోట్లు వ్యయం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర జనాభాలో 12.88 శాతం మంది ప్రస్తుతం పింఛన్లు పొందుతున్నారని తెలిపింది.

వివరాలు 

కొత్త పింఛన్ల ప్రక్రియ ఇలా..

దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు, ఈకేవైసీ తనిఖీ: ఈ నెల 7 నుంచి 16 వరకు.

సాధారణ అర్హతల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీ, వృత్తిపరమైన పింఛన్ల పరిశీలన: ఈ నెల 17 నుంచి 21 వరకు.

ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల పరిశీలన: ఈ నెల 22 నుంచి 24 వరకు.

బడ్జెట్‌ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం: ఈ నెల 25 నుంచి 26 వరకు.

ADVERTISEMENT