 
                                                                                AP Govt: ఏపీ ప్రభుత్వం-ప్రైవేటు ఆస్పత్రుల మధ్య చర్చలు సఫలం.. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ఆందోళనను విరమించిన ఆస్పత్రుల యాజమాన్యాలు రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవలను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించాయి. వెంటనే రూ.250 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు. నవంబర్ చివరికల్లా అన్ని పెండింగ్ బకాయిలను ఒకే విడతలో పూర్తిగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ స్పష్టమైన హామీ నేపథ్యంలో, ఆస్పత్రుల యాజమాన్యాలు వైద్యసేవలను పునరుద్ధరించేందుకు అంగీకారం తెలిపాయి.
వివరాలు
వన్ టైం సెటిల్‌మెంట్ కింద నవంబర్ చివరికల్లా చెల్లించాలని నిర్ణయం
గత 20 రోజులుగా బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా రూ.250 కోట్ల బకాయిలను విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని దశలవారీగా చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ, సమ్మె కొనసాగడంతో చివరికి మొత్తం బకాయిలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో నవంబర్ చివరికల్లా చెల్లించే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.