LOADING...
Hyderabad: జీహెచ్‌ఎంసీ పరిధితోనే మూడు కమిషనరేట్లు.. పునర్‌వ్యవస్థీకరణపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ..?  
పునర్‌వ్యవస్థీకరణపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ..?

Hyderabad: జీహెచ్‌ఎంసీ పరిధితోనే మూడు కమిషనరేట్లు.. పునర్‌వ్యవస్థీకరణపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ..?  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

జీహెచ్‌ఎంసీ తాజా పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పోలీసింగ్‌ వ్యవస్థలోనూ విస్తృత స్థాయి మార్పులు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లుగా కొనసాగుతున్న గ్రేటర్‌ పోలీసింగ్‌ పరిధిలో సరిహద్దుల మార్పు, చేర్పులు చేయనున్నారు. ఈ మేరకు పోలీస్‌ వ్యవస్థకు కొత్త రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌, డీజీపీ శివధర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్లు వీసీ సజ్జనార్‌, సుధీర్‌బాబు, అవినాశ్‌ మహంతి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు కీలక ప్రతిపాదనలను రూపొందించినట్లు సమాచారం. ఆదివారం కూడా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి, రాజధాని పోలీసింగ్‌ పునర్వ్యవస్థీకరణకు తుది ఆకృతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

వివరాలు 

16 నుంచి 12కు పోలీస్‌ జోన్లు 

ప్రతిపాదిత మార్పుల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకటి లేదా రెండు వార్డులను కలిపి ఒక పోలీస్‌ స్టేషన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు జనాభాసాంద్రతతో పాటు నేరాల తీవ్రతను ప్రధాన ప్రమాణాలుగా తీసుకోనున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ను పోలీస్‌ డివిజన్‌గా,జీహెచ్‌ఎంసీ జోన్‌ను పోలీస్‌ జోన్‌గా మారుస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తయితే సోమ, మంగళవారాల్లోనే ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 16 పోలీస్‌ జోన్లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 7,సైబరాబాద్‌లో 5,రాచకొండలో 4 జోన్లు కొనసాగుతున్నాయి. తాజాపునర్వ్యవస్థీకరణలో ఈ సంఖ్యను 12కి తగ్గించనున్నారు. కొత్త విధానంలో హైదరాబాద్‌లో 6, సైబరాబాద్‌,రాచకొండ కమిషనరేట్లలో చెరో 3 చొప్పున జోన్లు ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు 

 12 పోలీస్‌ జోన్లు అమల్లోకి.. 

ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్‌ను అక్కడి నుంచి తొలగించి,జిల్లా ఎస్పీ పరిధిగా మార్చనున్నారు. మరోవైపు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఓఆర్‌ఆర్‌ అవతల ఉన్న షాద్‌నగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను కలిపి ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అయితే తాత్కాలికంగా ఈ జోన్‌ను సైబరాబాద్‌ పరిధిలోనే ఉంచి, భవిష్యత్తులో ఫ్యూచర్‌ సిటీ పరిధిలోని ప్రాంతాలతో కలిపి కొత్త యూనిట్‌గా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మార్పులతో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న జోన్ల మాదిరిగానే మొత్తం 12 పోలీస్‌ జోన్లు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చార్మినార్‌, గోల్కొండ‌, ఖైరతాబాద్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్లు ఉండనున్నాయి.

Advertisement

వివరాలు 

రాచకొండ కమిషనరేట్‌కు కొత్త పేరు? 

సైబరాబాద్‌ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్లు, రాచకొండ కమిషనరేట్‌లో ఎల్‌బీ నగర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌ జోన్లు కొనసాగనున్నాయి. రాచకొండ కమిషనరేట్‌ పేరును మార్చే అంశంపైనా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు లష్కర్‌, మహంకాళి, సికింద్రాబాద్‌ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్యాంక్‌బండ్‌ అవతల ఉన్న సికింద్రాబాద్‌ ప్రాంతంలోని కొన్ని పోలీస్‌ స్టేషన్లను విడదీసి రాచకొండ కమిషనరేట్‌లో విలీనం చేయనున్నారు.

Advertisement

వివరాలు 

జలమండలి, ట్రాన్స్‌కో, జీఎస్టీ శాఖల పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు

ఇక మరోవైపు ట్యాంక్‌బండ్‌ నుంచి ప్రస్తుతం ఉన్న కొన్ని ఠాణాలతో పాటు సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలోని పలు పోలీస్‌ స్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌లో కలపనున్నారు. ముఖ్యంగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఉన్న పోలీస్‌ స్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఆదిభట్ల‌, సనత్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌, బాలాపూర్‌ తదితర ఠాణాలు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో విలీనం కానున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నుంచి పటాన్‌చెరు ప్రాంతంలోని కొన్ని పోలీస్‌ స్టేషన్లను సైబరాబాద్‌ కమిషనరేట్‌లో కలపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇదే తరహాలో భవిష్యత్తులో జలమండలి, ట్రాన్స్‌కో, జీఎస్టీ వంటి ఇతర శాఖల పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం.

Advertisement