Narmeta: నర్మెట ఆయిల్‌పామ్ కర్మాగారంతో రైతుల్లో కొత్త ఆశలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభమైన ఆయిల్‌పామ్ కర్మాగారం రైతుల్లో ఈ పంట సాగుపై విశ్వాసాన్ని పెంచుతోంది. స్థానిక రైతులతో పాటు రాష్ట్రంలోని 22 జిల్లాల రైతులకు ఈ కేంద్రం సేవలు అందిస్తోంది. ఈ ఏడాది మార్చి 22న ప్రారంభమైన ఈ కర్మాగారం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు వేల మంది రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక కర్మాగారంలో రోజుకు 600 టన్నుల సామర్థ్యంతో గెలలను క్రషింగ్ చేస్తున్నారు. ప్రారంభమైన 58 రోజుల్లోనే 17 వేల టన్నుల గెలలను ప్రాసెస్ చేశారు. గెలలను విక్రయించిన రైతులకు రూ.37 కోట్ల చెల్లింపులు జరిగాయి.
వివరాలు
రోజుకు పది టన్నుల బయోమాస్ ఉత్పత్తి
ఇప్పటివరకు 3,500 టన్నుల ముడి పామాయిల్‌తో పాటు సౌందర్య ఉత్పత్తులకు ఉపయోగించే 50 టన్నుల కర్నెల్ నూనె తయారైంది. ముడి నూనెను శుద్ధి చేసే కేంద్రం రాష్ట్రంలో లేకపోవడంతో ఇప్పటికే 3 వేల టన్నుల ముడి పామాయిల్‌ను ముంబయికి చెందిన సంస్థకు విక్రయించారు. కర్మాగారంలో మిగిలిన వ్యర్థ పదార్థాలతో బయోమాస్ తయారు చేసి రైతులకు ఎరువుగా అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. రోజుకు పది టన్నుల బయోమాస్ ఉత్పత్తి అవుతోంది. అలాగే నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన జీవ విద్యుత్ కేంద్రం ద్వారా కర్మాగార అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
వివరాలు
ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉపాధి
ఈ కర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రానికి ప్రతి నెలా భారీ స్థాయిలో వంటనూనెల దిగుమతులు జరుగుతున్నాయి. అందులో అధిక భాగం పామాయిల్‌దే. రాష్ట్రంలోనే రిఫైనరీ అందుబాటులోకి వస్తే ప్రతి నెలా 50లక్షల లీటర్ల పామాయిల్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అకాల వర్షాలు, చీడపీడల సమస్యలు తక్కువగా ఉండటం, వరి పంటతో పోలిస్తే నీటి అవసరం తగ్గడం, పంట ఎండబెట్టాల్సిన అవసరం లేకపోవడం, కొనుగోళ్లలో ఆలస్యం వంటి ఇబ్బందులు లేకపోవడం రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు ఆకర్షిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేటల్లో ఇప్పటికే ఆయిల్‌పామ్ కర్మాగారాలు పనిచేస్తుండగా, పదేళ్ల తర్వాత నర్మెటలో మూడో కర్మాగారం ప్రారంభమైంది.
వివరాలు
రవాణా ఖర్చును భరించనున్న ప్రభుత్వం
రాష్ట్రంలోని 22 జిల్లాల రైతులు సులభంగా గెలలను తరలించేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పొలం నుంచి సేకరణ కేంద్రాల వరకు గెలలను తీసుకెళ్లేందుకు అయ్యే రవాణా ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఇక నర్మెట తరహాలో ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొణిజర్ల, జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్‌పల్లి, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి, నల్గొండ జిల్లా యాచారంలో కొత్త కర్మాగారాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
వివరాలు
రూ.40 కోట్లతో రిఫైనరీ
వీటిలో రెండు ఈ ఏడాది ఆగస్టులో అందుబాటులోకి రానుండగా, మిగిలిన ఐదు వచ్చే ఏడాదిలో పూర్తికానున్నాయి. రాష్ట్రంలోనే ముడి పామాయిల్‌ను శుద్ధి చేసి వంటనూనె తయారు చేసేందుకు నర్మెట కర్మాగారం పక్కనే రెండు ఎకరాల్లో రూ.40 కోట్లతో రిఫైనరీ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఎనిమిది నెలల్లో ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
వివరాలు
ఏడాదిలో లక్ష టన్నులు
ఆయిల్‌ఫెడ్ ప్రాజెక్టుల నిర్వాహకుడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నర్మెట కర్మాగారం నిర్మించామని తెలిపారు. సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో తొలి దిగుబడులు రావడంతో ప్రస్తుతం రోజుకు 600 నుంచి 800 టన్నుల వరకు గెలలు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం గంటకు 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఉండగా, దానిని దశలవారీగా 120 టన్నులకు పెంచనున్నట్లు వెల్లడించారు. ఏడాది పొడవునా కర్మాగారాన్ని నడిపిస్తూ లక్ష టన్నుల క్రషింగ్ లక్ష్యంగా పెట్టుకున్నామని, రూ.50 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.