Crude Oil: చమురు నిల్వలు సమృద్ధిగా.. పెట్రో ధరలు పెరగవని స్పష్టం చేసిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలను పెంచే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. చమురు కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని పేర్కొన్నాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్ల పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు పెట్రో ధరలను పెంచే నిర్ణయం లేదని తెలిపాయి. కొంతకాలం వరకు ఉన్న ఒత్తిడిని చమురు కంపెనీలే భరిస్తాయని కూడా వెల్లడించాయి. వచ్చే 6 నుంచి 8 వారాల వరకు సరిపడేంత ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో నిల్వలు దేశంలో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Details
గ్యాస్ బుకింగ్ వ్యవధి పెంపు
ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 21 రోజుల వ్యవధిని 25 రోజులకు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. సిలిండర్ల నిల్వలను నియంత్రించడం మరియు వాటిని సమానంగా పంపిణీ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ఒక కుటుంబం సగటున సంవత్సరానికి 7 నుంచి 8 సిలిండర్లను వినియోగిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా 6 వారాల కంటే ముందే కొత్త సిలిండర్ అవసరం ఉండదని కూడా పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎల్పీజీ నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయని స్పష్టం చేశాయి.
Details
ఎరువుల నిల్వలూ సమృద్ధిగా
రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు కూడా దేశంలో సరిపడా నిల్వల్లో ఉన్నాయని భారత ఎరువుల సంఘం వెల్లడించింది. అయితే గ్యాస్ సరఫరాలో కోతలు, ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా యూరియా ఉత్పత్తిపై కొంత ఆందోళన నెలకొన్నట్లు పేర్కొంది. యూరియా దిగుమతి ఖర్చులు కూడా పెరగడం ఇబ్బందికరంగా మారిందని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువులు ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపోతాయని, అయితే దిగుమతి చేసుకునే ఎరువుల విషయంలో కొంత అనిశ్చితి ఉందని ఎఫ్‌ఏఐ డైరెక్టర్ జనరల్ చౌదరి సురేష్ కుమార్ తెలిపారు.
Details
177.31 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు
అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం 177.31 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. ఇందులో 59.30 లక్షల టన్నుల యూరియా, 25.13 లక్షల టన్నుల డీఏపీ, 55.87 లక్షల టన్నుల ఎన్‌పీకేఎస్ నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు రాబోయే వ్యవసాయ సీజన్ అవసరాలను తీర్చేందుకు సరిపోతాయని అధికారులు వెల్లడించారు.