మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు. జార్జ్ సోరోస్‌ను వయసు మళ్లిన వ్యక్తిగా ధనవంతుడిగా, ప్రమాదకరమైనవాడిగా జైశంకర్ అభివర్ణించారు. మిస్టర్ సోరోస్ న్యూయార్క్‌లో కూర్చొని ఉండి ప్రపంచం మొత్తం ఎలా పనిచేయాలో తన అభిప్రాయాలే నిర్ణయించాలని సోరోస్ భావిస్తారని జైశంకర్ పేర్కొన్నారు. అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడ్డాయని ఆరోపిస్తూ యుఎస్ ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఒక నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ స్టాక్‌లు భారీగా పతనమయ్యాయి.
జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ
జర్మనీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో సోరోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ వ్యాపార ఇబ్బందులతో మోదీ బలహీనపడతారని జోస్యం చెప్పారు. అదానీ పారిశ్రామిక సామ్రాజ్యంలో మోసం, స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై విదేశీ పెట్టుబడిదారులు, పార్లమెంటు నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వాలని సోరోస్ చెప్పారు. సోరోస్ వ్యాఖ్యలపై బీజేపీపై కూడా సీరియస్‌గా స్పందించింది. సోరోస్ ప్రధాని మోదీనే కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా టార్గెట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. సోరోస్ వ్యాఖ్యలు భారతదేశంపై దాడిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అభివర్ణించారు. సోరోస్ ఎన్జీవో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ఉపాధ్యక్షుడు సలీల్ శెట్టి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా వెల్లడించారు.