అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
అదానీ గ్రూప్ హిండెస్ బర్గ్ నివేదిక వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నివేదికను పరిశీలించేందుకు కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజెఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. నిపుణుల పేర్లను తాము ప్రభుత్వం నుంచి స్వీకరిస్తే, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. హిండెన్‌బర్గ్-అదానీ వివాదంపై దర్యాప్తు జరిపేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని నియమించబోమని స్పష్టం చేసింది.
కమిటీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి
విచారణ సందర్భంగా, న్యాయమూర్తులు స్వయంగా ఒక కమిటీని రూపొందిస్తారని, కేంద్రం జోక్యం చేసుకోదని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం, పిటిషనర్ల నుంచి ఎలాంటి సూచనలను స్వీకరించమని కోర్టు పేర్కొంది. పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలలో కమిటీ పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలని బెంచ్ తెలియజేసింది. దేశంలోని నియంత్రణ వ్యవస్థలను పటిష్టపరచడానికి తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ డొమైన్ ఎక్స్‌పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.