ఈనెల 17 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ ఈనెల 17 'చలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాస్తవానికి ఇటీవల పీఆర్సీ అంశంపై విద్యుత్ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలమైనట్లు జేఏసీ నేతలు చెప్పారు. ఆయితే ఆ ఒప్పందం తమకు అనుకూలంగా లేదని ఉద్యోగులు ఆరోపించారు. జేఏసీ నాయకులు ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన రూ.2.6 లక్షల గరిష్ఠ పే స్కేల్ ఆమోదం కాదన్నారు. అందుకే 17న చలో విజయవాడకు పిలుపునిచ్చినట్లు ఉద్యోగులు చెప్పారు. అయితే ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ పేర్కొన్నారు.
విజయవాడలో 144 సెక్షన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ చలో విజయవాడ నేపథ్యంలో పట్టణంలో 144 సెక్షన్ విధించినట్లు సీపీ కాంతిరాణా టాటా చెప్పారు. చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైతే కచ్చితంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఉద్యోగులను నిరోధించేందుకు సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, తమ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 24న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టినట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది.