LOADING...
Anakapalli: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. దువ్వాడ మార్గంలో రైలు ప్రమాదం.. ఒకరి మృతి 
దువ్వాడ మార్గంలో రైలు ప్రమాదం.. ఒకరి మృతి

Anakapalli: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. దువ్వాడ మార్గంలో రైలు ప్రమాదం.. ఒకరి మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖ జిల్లా దువ్వాడ మార్గంగా ఎర్నాకుళం వెళ్లాల్సిన టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ (18189) ఆదివారం అర్ధరాత్రి అనంతరం ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్యాంట్రీ కారుకు సమీపంలో ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను ఎలమంచిలి సమీపంలోని పాయింట్‌ వద్ద గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై రైలును స్టేషన్‌లో నిలిపివేశారు. అయితే అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే రెండు బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి తీవ్రంగా దగ్ధమయ్యాయి.

వివరాలు 

బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతోనే మంటలు

అగ్నిప్రమాదంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి బయటకు వచ్చి స్టేషన్‌లోకి పరుగులు తీశారు. చుట్టూ దట్టమైన పొగ కమ్ముకోవడంతో పరిస్థితి ఏంటన్నది అర్థంకాని గందరగోళం నెలకొంది. ఈ రైలు అనకాపల్లికి చేరుకునే సరికి ఇప్పటికే నాలుగు గంటల ఆలస్యం జరిగింది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నర్సింగబల్లి ప్రాంతంలో బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతోనే మంటలు చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అగ్నిప్రమాదంలో రెండు బోగీల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అత్యవసరంగా అంబులెన్సులను కూడా సిద్ధం చేశారు.

వివరాలు 

శాఖ-విజయవాడ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకల నిలిపివేత 

చలికాలం కావడంతో సుమారు రెండు వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ-విజయవాడ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అర్ధరాత్రి 3.30 గంటలు దాటిన తరువాత కాలిపోయిన రెండు బోగీలను రైల్వే సిబ్బంది తొలగించారు. ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగిలిన బోగీల్లో సర్దుబాటు చేసి రైలును ముందుకు పంపేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

Advertisement

వివరాలు 

ఒకరి మృతి 

మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ బీ1 ఏసీ బోగీలో ఒకరు సజీవదహనానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. మృతుడిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్‌ (70)గా గుర్తించారు. మరోవైపు, దగ్ధమైన రెండు బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట స్టేషన్‌కు మూడు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ రెండు ఏసీ బోగీలను జత చేసి, అనంతరం రైలును ఎర్నాకుళం వైపు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. పలు రైళ్లు ఆలస్యం ఈ ఘటన ప్రభావంతో విశాఖ నుంచి విజయవాడ దిశగా వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, తుని స్టేషన్లలో కొన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement