One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీని కూడా వేశారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' నిర్వహించాలన్న కేంద్రం ఆలోచనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ ఆలోచనను రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే అవకాశాలను అన్వేషించేందుకు కేంద్రం శనివారం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయగా, ఆ కమిటీ నుంచి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం వేసిన కమిటీ సందేహాస్పదంగా ఉందని కాంగ్రెస్ పేర్కొంది.