
#NewsBytesExplainer: వికారాబాద్ అధ్యక్షుడి విషయంలో వివాదం.. తెలంగాణ బీజేపీలో కట్టు తప్పుతున్న క్రమశిక్షణ
ఈ వార్తాకథనం ఏంటి
క్రమశిక్షణకు ప్రతీకగా పేరుగాంచిన బీజేపీలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా? ఆ పార్టీ అంతర్గతంగా విభేదాలు, తగాదాలకు వేదికగా మారుతోందా? జిల్లాల వారీగా గొడవలు పెరిగిపోతున్నాయా? ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ దిశగానే సంకేతాలిస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో పరిస్థితులు మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం క్రమశిక్షణ విషయంలో మాత్రం కట్టు తప్పలేదన్న అభిప్రాయం ఉండేది. కానీ... తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ పరిస్థితుల్ని మార్చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పంచాయతీ కొంత కాలంగా నడుస్తోంది. అక్కడ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై నేతల మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆయనను పదవి నుంచి తప్పించాలంటూ పట్టుబట్టారు.
వివరాలు
మరో ఆరు జిల్లాల్లో ఇదే పరిస్థితి
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జిల్లా నేతలతో మాట్లాడి నివేదికను రాష్ట్ర అధ్యక్షుడికి సమర్పించింది. దాని ఆధారంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, రాజశేఖర్ రెడ్డిని రాజీనామా చేయాలని సూచించారని, ఆ సూచన మేరకు ఆయన లేఖను సమర్పించారని సమాచారం. చివరికి ఈ వ్యవహారంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాటే నెగ్గినట్టయింది. ఇలాంటి పరిస్థితే మరో ఆరు జిల్లాల్లో కొనసాగుతోందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఆ జిల్లాల్లోని అధ్యక్షుల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. వాళ్లపై చర్యలు తప్పవన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాలోనూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
వివరాలు
ఇద్దరికీ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు
రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే మాజీ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎంపీ అభ్యర్థి గోమాస్ శ్రీనివాస్‌ల మధ్య వాగ్యుద్ధం తలెత్తింది. ఈ ఇద్దరికీ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరు ఇక ఒకే వేదికపై కలిసి పని చేసే పరిస్థితి కనబడడం లేదని చెబుతున్నారు. పార్టీ ఉన్నత నాయకత్వం కూడా క్రమశిక్షణలో రాజీ పడబోమని సంకేతాలిస్తోంది. గతంలో కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి నేతల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయని బీజేపీ వర్గాల ఆత్మపరిశీలన చెబుతోంది.
వివరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదే పరిస్థితి
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి అంతకంటే బాగోలేదు. అక్కడ బలం తక్కువగా ఉన్నప్పటికీ, నేతల మధ్య ఘర్షణలు మామూలుగా లేవు. ఆ వివాదాలను సర్దుబాటు చేయడానికి రాష్ట్ర నాయకత్వం మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా త్వరలో చర్యలు ఉండొచ్చని అంటున్నారు. మొత్తం మీద చూస్తే.. "క్రమశిక్షణ పార్టీ"గా పేరొందిన బీజేపీలో ఇప్పుడు ఆ కట్టు కొంచెం వదులవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ లేఖలు, షోకాజ్ నోటీసులు నిజంగా క్రమశిక్షణను తిరిగి స్థాపించగలవా అన్నది చూడాలి.