Operation Sindoor: పాక్‌లో ఏ ఉగ్ర స్థావరం సురక్షితం కాదు: భారత త్రివిధ దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని ఏ ఉగ్ర స్థావరం కూడా సురక్షితం కాదని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత త్రివిధ దళాలు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు వెల్లడించాయి. దేశ ప్రజల భద్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశాయి. ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తైన సందర్భంగా జైపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్ ముగియలేదని, ఇది కేవలం ఆరంభమేనని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే పోరాటాన్ని భారత్ నిరంతరం కొనసాగిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు. వివిధ విభాగాల సమన్వయంతో తక్కువ సమయంలోనే అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు చేసినట్లు వివరించారు.
వివరాలు
గత ఏడాది మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభం
గత ఏడాది సైన్యంలో సైనిక కార్యాచరణల విభాగపు ప్రధాన అధికారి స్థాయిలో పనిచేసిన ఆయన ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించారు. అదే విధంగా వాయుసేన ఉన్నతాధికారి ఎయిర్ మార్షల్ ఏకే భారతీ మాట్లాడుతూ.. ఆపరేషన్ ద్వారా భారత వాయుసేన సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పామని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ దళాలు గత ఏడాది మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని కీలక ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు జరిపి వాటిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.