Loading...
CM Revanth Reddy: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రతిపాదన
21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రతిపాదన

CM Revanth Reddy: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రతిపాదన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం, ఆందోళన చేసిన విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా యువత వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా కాక్రోచ్‌ జనతా పార్టీ సభ్యులు, విద్యార్థులు హైదరాబాద్‌లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం, యువత పోరాట స్ఫూర్తిని కొనియాడారు.

వివరాలు 

విజయ దరహాసం మీ ముఖాల్లో కనిపిస్తోంది

శనివారం రాత్రి హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో యువత విజయం సాధించిందన్నారు.

"కేంద్ర ప్రభుత్వం ఎన్ని హింసలు, అణచివేత చర్యలు చేపట్టినా నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు యువత పోరాటాన్ని కొనసాగించింది.

మీ ముఖాల్లో ఇప్పుడు విజయ దరహాసం కనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

జెన్‌-జీ చట్టసభల్లోకి రావాలి

జెన్‌-జీ యువత కేవలం రహదారులపై నిరసనలకు మాత్రమే పరిమితం కాకుండా చట్టసభల్లోనూ ప్రవేశించి తమ గళాన్ని వినిపించాలని సీఎం పిలుపునిచ్చారు.

యువతకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు 21 సంవత్సరాల వయసులోనే లోక్‌సభ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

జర్మనీ, బ్రిటన్‌ వంటి దేశాల్లో చిన్న వయసులోనే యువత చట్టసభలకు ఎన్నికవుతోందని గుర్తు చేశారు.

భవిష్యత్తులో రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత జెన్‌-జీ యువతకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని తెలిపారు.

ఈ అంశంపై పార్లమెంట్‌లో బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో తెలంగాణ నుంచి తొలిసారిగా తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందుకోసం ఆగస్టు తొలి వారంలో రాష్ట్ర శాసనసభ, శాసన మండలిని ప్రత్యేకంగా సమావేశపరచి తీర్మానం ఆమోదిస్తామని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

చట్టసభల్లో యువతకు తక్కువ ప్రాతినిధ్యం

దేశ జనాభాలో 30 శాతం మంది యువతీయువకులే ఉన్నప్పటికీ, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కేవలం ఒక శాతం మాత్రమే ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు.

పార్లమెంట్‌లో 60, 70 ఏళ్ల వయసున్న సభ్యులు విద్యాశాఖ, ఆర్థికశాఖ, ఐటీ శాఖల మంత్రులుగా ఉన్నారని పేర్కొంటూ, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.

జెన్‌-జీ యువత చట్టసభల్లోకి వచ్చి మంత్రులుగా దేశ భవిష్యత్తు కోసం తమ ఆలోచనలు, భావజాలాన్ని ఉపయోగించాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

యువతకు అవకాశాలు కల్పించిన నేతలను గుర్తు చేసిన సీఎం

యువశక్తిని ముందుగానే గుర్తించిన రాజీవ్‌ గాంధీ ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారని సీఎం గుర్తు చేశారు.

అలాగే, పీవీ నరసింహారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసును 21 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ రాజ్యాంగ సవరణ చేశారని చెప్పారు.

త్రివేండ్రంలో 21 ఏళ్ల యువతి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన శ్రీలక్ష్మి 21 ఏళ్లకే ఐఏఎస్‌గా ఎంపికయ్యారని, ప్రస్తుత తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ 22 ఏళ్లకే ఐపీఎస్‌గా ఎంపికయ్యారని తెలిపారు.

"21 ఏళ్ల వయసులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జిల్లాల పరిపాలన, శాంతిభద్రతలు నిర్వహించగలిగితే, అదే వయసులో ఎమ్మెల్యే, ఎంపీ ఎందుకు కాలేరు?" అని ప్రశ్నించారు.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

నీట్‌ పేపర్‌ లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను సోమవారం లోపు ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం డిమాండ్‌ చేశారు.

పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాని వల్ల వందలాది మంది విద్యార్థులు నష్టపోయారని విమర్శించారు.

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత ఉద్యమించగా, కేంద్ర ప్రభుత్వం వారిని అణచివేయడానికి అన్ని విధాలా ప్రయత్నించిందన్నారు.

ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించే కేంద్ర ప్రభుత్వం, విద్యార్థులను మాత్రం శారీరకంగా, మానసికంగా వేధించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.

లాఠీఛార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు జరిగినా యువత వెనక్కి తగ్గలేదని, వారి అసమాన పోరాటంతో కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించారని కొనియాడారు.

ADVERTISEMENT