LOADING...
Bihar polls: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీతో విపక్ష కూటమి మ్యానిఫెస్టో విడుదల
ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీతో విపక్ష కూటమి మ్యానిఫెస్టో విడుదల

Bihar polls: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీతో విపక్ష కూటమి మ్యానిఫెస్టో విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే హామీలతో రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి 'మహాగఠ్‌బంధన్' తమ ఎన్నికల ప్రకటన పత్రం 'తేజస్వీ ప్రతిజ్ఞా ప్రాణ్‌' (Tejashwi Pratigya Pran)ను విడుదల చేసింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా తదితరులు ఈ మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. బిహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించి దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రంగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని తేజస్వీ యాదవ్‌ స్పష్టం చేశారు.

Details

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి

తాజాగా పార్సా, సారణ్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వీ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. మద్యం నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మద్యం స్వేచ్ఛగా లభిస్తోందని, ఇళ్లకే నేరుగా సరఫరా అవుతోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సాగునీటి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, గత ఇరవై ఏళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఈ హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు.

Details

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

సారణ్‌లో దోపిడీలు, హత్యలు, అపహరణలు ప్రతిరోజూ జరుగుతున్నాయి. అయినప్పటికీ సీఎం నితీశ్‌ కుమార్‌ ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడి, ఉద్యోగాలను కల్పించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు. బిహార్‌లో 2016నుండి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, మద్యం తయారీ, అమ్మకం, వినియోగం కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధాన్ని ఎత్తివేస్తామని ఇప్పటికే ప్రకటించింది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 6న తొలి దశ, నవంబర్‌ 11న రెండో దశలో పోలింగ్‌ జరగనుంది.