Om Birla: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. 103 మంది సభ్యుల సంతకాల సేకరణ
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్టు సమాచారం. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం,ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయడం,కాంగ్రెస్ మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ నిశికాంత్ దుబేపై చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలే ఈ నిర్ణయానికి కారణాలుగా విపక్షాలు చెబుతున్నాయి. సోమవారం రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన సమావేశంలో తృణమూల్, డీఎంకే, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొని ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
వివరాలు
..వీటిపై మాట్లాడనివ్వండి
అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఎప్పుడు సమర్పించాలన్నది మంగళవారం నిర్ణయించనున్నారు. సభలో ప్రతిష్టంభన తొలగింపుపై చర్చించేందుకు రాహుల్ గాంధీతో పాటు మరికొందరు విపక్ష ఎంపీలు సోమవారం స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. తాను లేవనెత్తదలచిన అంశాలను వివరించిన రాహుల్, వాటిపై మాట్లాడనిస్తే చర్చకు సిద్ధమని తెలిపారు. ఈ భేటీలో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, డీఎంకే నేత టి.ఆర్.బాలు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొని వేర్వేరు అంశాలను ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వంతో మాట్లాడి చెబుతానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. అయితే రాహుల్ ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చి, మిగతావారికి ఇవ్వకపోతే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
'స్పీకర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు'
ఎంపీల నుంచి ప్రధానికి ముప్పు ఉందని భావిస్తే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ సూచించారు. సభలో తాను చెప్పబోయే నిజాలపై భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. తాను నరవణె పుస్తకం ఇవ్వబోతున్నాననే భయంతోనే ప్రధాని కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్‌పై అధికారపార్టీ ఒత్తిడి ఉందని,ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు వారు స్పీకర్‌కు లేఖ రాశారు. సభకు ప్రధాని గైర్హాజరును సమర్థించే క్రమంలో తమపై నిరాధార ఆరోపణలు చేశారని,ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సభకు నిష్పక్షపాత సంరక్షకుడిగా వ్యవహరించాలని స్పీకర్‌ను కోరారు.ఈ లేఖపై ప్రియాంక గాంధీతో పాటు పలువురు మహిళా ఎంపీలు సంతకాలు చేశారు.
వివరాలు
రాజ్యసభ నుంచి విపక్షం వాకౌట్
మాజీ ప్రధానులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీలపై చర్యలు లేకపోవడాన్ని కూడా వారు తప్పుపట్టారు. స్పీకర్‌పై వ్యక్తిగతంగా గౌరవం ఉందని, అయినా ఆయన ఎప్పటికప్పుడు అధికారపార్టీ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. సభకు వెళ్లి వెంటనే బయటకు రావాల్సి వస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం పార్లమెంటులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాల నిరసనలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. రాహుల్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌తో విపక్షం సభను నిలిపివేసింది. ఇరుపక్షాల వాదనల అనంతరం లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు. అదే సమయంలో రాజ్యసభలో ఖర్గేకు మాట్లాడేందుకు అనుమతి లభించకపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు వాకౌట్ చేశాయి.
వివరాలు
చర్చ జరగకపోతే విపక్షానికే నష్టం: రిజిజు
వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్పై డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సభాహక్కుల తీర్మానానికి నోటీసు ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే అమెరికా వాణిజ్య ఒప్పందంపై బయట ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సభలో తమకు సంఖ్యాబలం ఉన్నందున ఏ బిల్లునైనా ఆమోదింపజేసుకోవడంలో ఇబ్బంది లేదని, చర్చ జరగకపోతే నష్టపోయేది విపక్షాలేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తెచ్చినా ఆయనను తొలగించేందుకు కావాల్సిన బలం విపక్షాలకు లేదని తెలిపారు. స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని భద్రతపై స్పీకర్ ఆందోళన చెందడానికి తగిన కారణాలున్నాయని, వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకే ఆయన నిర్ణయాలు తీసుకున్నారని లోక్‌సభ సచివాలయం స్పష్టం చేసింది.